బుుషికేష్, పవిత్ర గంగానదీ తీరాన రెండు నెలల పాటు సాగిన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి చాతుర్మాస్యదీక్ష నేడు ముగిసింది. లోక కల్యాణం కోసం పదేళ్లుగా ఋషీకేశ్ లో చాతుర్మాస్య దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా జూలై 16న బుుషికేష్, శారదాపీఠం ఆశ్రమంలో శ్రీ స్వరూపనందేంద్ర సరస్వతీ మహాస్వామి వారు దీక్ష ప్రారంభించారు, ఇటీవల విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా నియమితులైన శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కూడా మహాస్వామివారితో కలిసి చాతుర్మాస్య దీక్ష ఆచరించారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వాత్మానందేంద్ర స్వామి తొలిసారిగా చాతుర్మాస్య దీక్ష పాటించడం విశేషం. కాగా దీక్షా సమయంలో హరిద్వార్, బుుషికేష్ తదితర ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో స్వామిజీలు పలు ధార్మిక, సేవా వితరణ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే హరిద్వార్, బుుషికేష్లో ప్రాంతాల్లోని పలు పవిత్ర క్షేత్రాలను సందర్శించారు. దీక్షా సమయంలో గంగా నదీ తీరంలో భగవద్గీత పారాయణం చేశారు. చాతుర్మాస్య దీక్ష ముగింపు సందర్భంగా గంగా నదీ తీరంలో స్వామిజీలు స్నానానుష్టానం ఆచరించారు. రెండు నెలల పాటు సాగిన చాతుర్మాస్య దీక్ష ముగియడంతో రెండు, మూడు రోజుల్లో స్వామిజీలు విశాఖకు పయనం కానున్నారు. స్వామిజీల రాక సందర్భంగా విశాఖకు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఇప్పటికే స్వామిజీల స్వాగతం పలుకుతూ విశాఖ నగరం అంతటా హోర్డింగ్లు పెట్టారు. స్వామిజీల దర్శనానికై చినముషిడివాడలోని శారదాపీఠం భక్తులతో పాటు, విశాఖ ప్రజలు, తెలుగు రాష్ట్రాల భక్తులు ఎదురుచూస్తున్నారు.
