ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి బోల్తా పడిన కారులో మంటలు వ్యాపించటంతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన మామడుగు సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గోర్లకుంటకు చెందిన ఆరుగురు ఏపీ 03 బీఎన్ 7993 నెంబర్ కారులో బెంగళూరు నుంచి పలమనేరుకు బయలు దేరారు. కారు మామడుగు సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటి తర్వాత కారు మంటల్లో కాలి పోవటం గుర్తించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పి విష్ణు అనే వ్యక్తిని ప్రాణాలతో బయటకు తీశారు. మిగిలిన ఐదుగురు కళావతి, జాహ్నవి, తేజ, పావన రామ్, అశ్రితలు సజీవదహనమయ్యారు. విష్ణు పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
