తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహమద్ షకీల్ అమీర్ గురువారం నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తో భేటీ అయిన సంగతి విదితమే. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో మైనార్టీ వర్గం నుండి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన తనకు అన్యాయం జరిగిందని తీవ్ర మనస్థాపానికి గురై పార్టీ మారబోతున్నారు అని ఇటు సోషల్ మీడియా.. అటు ఎలక్ట్రానికి మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలపై స్పందించిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ మీడియాతో మాట్లాడుతూ”బోధన్ లో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మర్యాదపూర్వకంగా ఆహ్వనించడానికి ఎంపీ అరవింద్ గారింటికెళ్లి స్వయంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నేను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలను కావాలనే ప్రచారం చేశారు. మరియు టీవీలల్లో కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నట్లు కూడా అసత్యప్రచారం చేశారు. కానీ అవన్నీ అవాస్తవాలు.. నేను వాటిన్నిటిని ఖండిస్తున్నాను.ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నాకు మంచి అనుబంధముంది.
దాదాపు పన్నెండేళ్ల నుంచి వారి నాయకత్వంలోనే పనిచేస్తున్నాను. నేను ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. నేను 2009 ఎన్నికల్లో ఓడిపోయిన కానీ నాపై నమ్మకంతో తర్వాత ఎన్నికల్లో ఒక మైనార్టీ నేతను ఎమ్మెల్యేగా చూడాలనే లక్ష్యంతోనే నన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబెట్టి.. గెలిపించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోనే 2014,2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాను.ఒకసారి ఓడిపోయిన కానీ మరో రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు.నాకు గాడ్ ఫాదర్ కేసీఆర్ గారే” అని ఆయన వివరణిచ్చారు.