గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష టీడీపీ వైసీపీని డిఫెన్స్ చేసేందుకు ఒకే ఒక అస్త్రం రాజధాని.. మాట్లాడితే రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తోంది. అమరావతి గురించి గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. అయితే రాజధానిగా అమరావతి ఉంటుందా.? మారుస్తారా.? అంటూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశంపై స్పష్టత ఇవ్వకుండా మౌనం వహిస్తుండడం కూడా టీడీపీ స్వరం పెంచుతుండటానికి కారణమైంది. అందుకే దీనిపై అనుమానాలు మరింత ఊపందుకున్నాయి. అయితే తాజాగా జగన్ రాజధాని అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి అంశంపై సర్కార్ ఓ కమిటీ నియమించింది.
ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్ గా వ్యవహరించే ఈకమిటీలో ప్రొఫెసర్ మహా వీర్, అంజలీమోహన్, శివానంద స్వామి, కేటీరవీంద్రన్, డాక్టర్ అరుణాచలంలు సభ్యులుగా ఉన్నారు. ఈకమిటీ ఆరువారాల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కమిటీ నివేదికతో రాజధాని అమరావతిలోనే ఉంటుందా లేదా అనే సందేహాలకు త్వరలో తెరపడే అవకాశాలు ఉంది ఈ కమిటీ రిపోర్టును సమీక్షించి తాను కూడా మేధోమధనం చేసిన తర్వాత జగన్ స్పష్టత ఇస్తూ కీలక నిర్ణయం తీసుకోనున్నారు.