తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తట్టాబుట్టా సర్దేసుకుంది.. గతంలో ఇక్కడ పార్టీకి సమయం కేటాయిస్తానని చంద్రబాబు, ఆయన తనయుడు చెప్పినా అవి తెలంగాణలో టిడిపి ఉనికిని ఏమాత్రం కాపాడలేకపోయాయి. అసలు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం సోదిలోనే లేకుండా పోయింది. దీంతో పార్టీకి ఒక్కొక్కరుగా మొత్తం గుడ్ బై చెప్పేసారు. ఆపార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు వంటి నేతలు కూడా లేరంటే ఇంకా టీడీపీలో ఎవరున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపి 23మంది వైసీపీ కి చెందిన ఎమ్మెల్యేలను లాక్కున్న టీడీపీ2019లో కేవలం 23మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టింది.
అయితే ఆపార్టీకి ముందుంది ముసళ్ల పండుగ అంటున్నారు వైసీపీ నేతలు. టీడీపీలా తాము ఫిరాయింపులను ప్రోత్సహించే ప్రసక్తి లేదని వైసీపీ అధినేత, సీఎం జగన్ అసెంబ్లీలో ధైర్యంగా ప్రకటించారు. ఆపరేషన్ ఆకర్ష్ అనేది వైసీపీ తరపున చేయకపోయినా టీడీపీకి రాజీనామా చేసి, ఉప ఎన్నికలు రప్పించి ఆ జెండా తరపున గెలుద్దామని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్ చార్జ్ లు, ద్వితియశ్రేణి నాయకులు, పార్టీకి ఇంతకాలం పార్టీకి అండగా ఉన్న నేతలంతా వీలైనంత త్వరగా వైసీపీలోకి దూకేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. వారితోపాటు అనుచరులు, అభిమానులు ఇతర నేతలు సైతం వైసీపీ వైపే చూస్తున్నారట.
దీంతోపాటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 10శాతం సాధించాలి.. అలాచూస్తే టీడీపీకి 18సీట్లకే పరిమితం కావాలి.. ప్రస్తుతం 23మాత్రమే ఉన్నాయి. ఐతే ఓ ఆరుగురు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తే టీడీపీ ప్రతిపక్ష హోదా కచ్చితంగా కోల్పోతుంది. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ ఛాన్స్ దొరుకుతుందా.. జగన్ ఎప్పుడు ఓకే చెప్తారా అని ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్ధ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోబోతున్నారట.. ఎలాగో ఏ పదిహేనేళ్లు వైసీపీ ప్రభుత్వానికి డోఖా ఉండదు కాబట్టి జగన్ ఓకే చెప్తే ఉప ఎన్నికలకు వెళ్లి గెలుద్దాం అంటూ గొట్టిపాటి రవి, కరణం బలరాం, నిమ్మల రామానాయుడు వంటి ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.