గత చంద్రబాబు నాయుడి ప్రభుత్వ అండదండలతో తెలుగుదేశం నేతల కబ్జాల పర్వం ఒక్కొక్కటిగా వెలుగు చూసాయి.. తాజాగా విజయవాడ నడిబొడ్డున ఉన్న మధురానగర్‌లో టీడీపీనేత, రాష్ట్ర్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు కుటుంబం దర్జాగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని శుక్రవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కబ్జాచేసిన స్థలానికి కుటుంబరావు సోదరుడు పెట్టిన బోర్డులను కూడా అధికారులు తొలగించారు. అయితే కుటుంబరావు కుటుంబీకుల చేతుల్లో కబ్జాకు గురైన స్థలం గేటుకు జేసీ మాధవీలత నోటీసులంటించారు.
టీడీపీ హయాంలో కుటుంబరావు కుటుంబీకులు మొత్తం రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని చేజిక్కించుకున్నారు. న్యాయ స్థానాలకు కూడా వాస్తవాలు తెలుపకుండా వివిధ శాఖలను మేనేజ్ చేసి భారీగా లబ్ధి పొందారు. ఈ విషయం ఇటీవల ‘స్పందన’ కార్యక్రమానికి అందిన ఫిర్యాదులద్వారా వెలుగుచూసింది. తాను నీతిమంతుడినని ప్రగల్భాలు పలికిన కుటుంబరావు కబ్జా వెలుగులోకి రావడంతో బెజవాడ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. కలెక్టర్ ఆదేశాలతో రికార్డులు పరిశీలించి విచారణ జరపగా అర్బన్ ల్యాండ్ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ మిగులుభూమిని ఆక్రమించారని తేలిందన్నారు. రెవెన్యూ, రైల్వే అధికారులను తప్పుదారి పట్టించి పట్టా భూమిగా స్వాధీనం చేసుకున్నారని, కుటుంబరావుపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు పెట్టామని వెల్లడించారు. ఎవరైనా ఆ భూమిలోకి చొరబడాలని చూస్తే కఠినచర్యలు తప్పవని జేసీ మాధవీలత హెచ్చరించారు.