ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతం వరకూ తాను మాట్లాడనని కానీ ఇకపై ఏ ఛానెల్ కానీ, ఏ పత్రిక కానీ.. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు ప్రచురించిందని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్పుడే మీడియాపై జగన్ ఉక్కుపాదం తప్పదంటూ అనుకున్నారు. అయితే ఇప్పుడు అధికారికంగా నిషేధం విధించకపోయినా ఏబీఎన్ ఛానెల్ కు జగన్ సర్కార్ భారీ షాకిచ్చింది. ఏబీఎన్ ఛానెల్ ప్రసారాలను నిలిపివేయాలని మంత్రులు ఆపరేటర్లను ఆదేశించారట. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఏబీఎన్ ఛానెల్ ప్రసారాలు నిలిచిపోయాయట. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందట.
ఈ విషయం ఆంధ్రజ్యోతి తన పత్రికలో రాసింది. కాగా ఈవిషయంపై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా వెంటనే స్పందించారు. శుక్రవారం నాడు టీడీపీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యి మాట్లాడుతూ కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాల నిలిపివేత విషయంపై ప్రభుత్వ వైఖరిపై చంద్రబాబు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూస్ ఛానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమేంటంటూ చంద్రబాబు విస్మయం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చూశారని, ఇప్పుడు న్యూస్ చానెళ్ల గొంతు నొక్కేస్తున్నారంటూ మాట్లాడారు. అయినా ఛానళ్ల ఎంపిక వినియోగదారుల అభీష్టం కానీ ఏ ఛానళ్ళు కావాలో వినియోగదారులే ఎంచుకుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మీరెందుకు నిలిపివేసారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పధకాలపై, రాజధాని పై దుష్ప్రచారం చేసినందుకు ఈ పనిచేసారంటూ వైసీపీ శ్రేణులు చెప్తున్నారు.