రవాణాశాఖ మంత్రిగా అవకాశం దక్కించుకున్న సీనియర్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారి ఖమ్మంలో పర్యటించారు.ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో జరిగిన టీఆర్ఎస్ స్వాగత సభలో మంత్రి అజయ్ పాల్గొని ప్రసంగించారు. మంత్రివర్గంలో చోటు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో అందరినీ కలుపుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ప్రజాప్రతినిధులందరినీ కలుపుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కష్టపడి పనిచేసి సీఎం కేసీఆర్ చేత శభాష్ అనిపించుకుంటాన్నారు.
ఖమ్మం జిల్లాకు మంత్రిపదవి ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంపీ నామా నాగేశ్వర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి అజయ్ కుమార్ కి కుడి భుజం లా ఉండి ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో పథంలో తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు హరిప్రియ, రాములు నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.