నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో చేరి ప్రత్యర్థ పార్టీపై ఘాటువ్యాఖ్యలు చేసి, తన ఫన్నీ వ్యాఖ్యలతో తెగ నవ్వించి. కాంగ్రెస్ ఓడిపోతే బ్లేడుతో పీక కోసుకుంటా అని ఆపార్టీ ఓడిపోయాక రాజకీయాలకు గుడ్‌బై చెప్పి ఇప్పుడు మళ్లీ లైన్‌లోకి వచ్చారు. ఈసారి ఏపీలో పరిస్థితులపై స్పందించారు. అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. పల్నాటి గొడవలతో ఏపీ పరువు గంగలో కలిసిపోయిందని, ఆంధ్రా మరో బీహార్‌లా తయారైందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణాలను అటకెక్కించారంటూనే అసలు రాజధానిగా అమరావతి ఉంటుందో ఊడుతుందో తెలియక ప్రజలు జుట్టు పీక్కుంటున్నారని ఆయన మండిపడ్డారు.
అలాగే వైసీపీ పాలనపైనా విమర్శలు చేశారు. జగన్ తన వందరోజుల పాలనలో ఏమీ చేయలేదని, జగన్ నిద్రలేవాలని సూచించారు. కక్ష సాధింపులతో పరువు బజారుపాలు చేసుకోవద్దని సూచించారు. చంద్రబాబు కూడా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలన్నారు. ఏ జెండా, ఎజెండా లేని నాయకులు రెస్ట్ తీసుకుంటే మంచిదంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘దగాపడ్డ తెలుగు ప్రజలారా! ఏ నాయకుడినీ నమ్మొద్దు, మీకు సాయంచేసే స్థితిలో నేనులేను, మనందరినీ ఆ భగవంతుడే కాపాడాలని. భావితరాలకు ఆయనే దిక్కు’’ అంటూని బండ్ల వ్యాఖ్యానించారు.
అయితే ఇప్పుడు సడన్ గా బండ్ల ఎందుకు హడావిడి చేస్తున్నారు.? పది నెలల తర్వాత తెలంగాణా రాజకీయాలు వదిలి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు వేలు పెట్టారనేది చూడాలి. అయితే జగన్ పై డైరెక్ట్ గా విమర్శలు చేసిన బండ్లపై వైసీపీ శ్రేణులు మండి పడుతున్నారు. మాట ఇచ్చి పిచ్చి వేషాలు వేయడం రాజకీయం కాదని, ఏపీ ప్రజలు ఎందుకు దగా పడ్డారో సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. అలాగే .. 7o క్లాక్ బ్లేడ్ ఇష్యూ ఏమైందని, తమ నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్తావా? లేదా? అంటూ నిలదీస్తున్నారు.