తెలంగాణలో నూతన సచివాలయం నిర్మాణపై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం కొత్త పార్లమెంటు నిర్మాణానికి సిద్ధమవుతోంది. 2022లో భారత స్వాతంత్య్రానికి 75 ఏళ్లు నిండుతాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలా లేక ఉన్న బిల్డింగ్‌ను మరింత ఆధునీకరించాలా అన్న ఆలోచనల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖ అనేక కోణాల్లో పరిశీలనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీన కేంద్ర గృహనిర్మాణ శాఖ దీని కోసం ప్రతిపాదనలు కూడా చేసింది. బిల్డింగ్‌కు కావాల్సిన డిజైన్, ఆర్కిటెక్చర్ సంస్థలకు ఈ సమాచారాన్ని చేరవేసింది. కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల కోసం కామన్ సెక్రటేరియేట్ నిర్మించాలని కూడా కేంద్ర భావిస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఇటీవల ముగిసిన సమావేశాల్లో .. పార్లమెంట్ భవనాన్ని పునర్ నిర్మించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆధునిక వసతులు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా ఇదే తరహా అభ్యర్థన చేశారు.