ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దొంగదీక్ష, కొంగ జపాలను ప్రజలు ఏమాత్రం నమ్మరన్నారు. పచ్చనేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాపచుట్టి కృష్ణా నదిలో పడేసారంటూ చురకలంటించారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చనేతలు బెదిరించి కూర్చోబెడుతున్నారని ఎద్దేవాచేశారు.
పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిన సిగ్గుమాలిన రాజకీయం చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అచ్చెన్నాయుడు అహంభావంతోనే పోలీస్ అధికారులను దూషించారంటూ మోపిదేవి మండిపడ్డారు. అచ్చెన్నాయుడు ఇంకా తామే అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు. పోలీసు అధికారులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఉరుకునేది లేదన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కోడెల, యరపతినేని కుటుంబాల చేతిలో పల్నాడు తీవ్రంగా నలిగిపోయింది. చంద్రబాబు అప్పుడేంచేశారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పల్నాడు ప్రశాంతంగా ఉందని, ఎక్కడా ఒక్క రాజకీయ దాడి ఘటన కూడా చోటుచేసుకోలేదన్నారు. చాలాకాలం తర్వాత కృష్ణమ్మకు భారీ నీళ్లొచ్చాయని, యువతకు ఉద్యోగాలు రావడంతో అంతా ప్రశాంతంగా ఉన్నారన్నారు.