అట్రాసిటీ కేసులో ఇరుక్కుని, గత 14 రోజులుగా అజ్ఞాతంలో తిరుగుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్..ఇవాళ దుగ్గిరాలలోని తన భార్యను చూడటానికి వచ్చి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాగా చింతమనేనిపై మొత్తం 50 కేసులు నమోదు కాగా, వాటిలో ఒక కేసులో ఆయనకు శిక్ష కూడా పడింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వట్టి వసంతకుమార్‌పై భౌతిక దాడికి పాల్పడిన కేసులో శిక్షపడగా హైకోర్ట్‌కు వెళ్లి స్టే తెచ్చుకుని..ఎమ్మెల్యేగా కొనసాగాడు. అయితే ఇవాళ అట్రాసిటీ కేసులో చింతమనేనిని అరెస్ట్ చేసిన పోలీసులు..ఆయన్ని కోర్టులో హాజరుపరచగా..ఆయనకు ఈ నెల 25 వరకు అంటే రెండు వారాల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో గత 14 రోజులుగా అజ్ఞాతంలో ఉంటూ ముందస్తూ.. బెయిల్ కోసం చింతమనేని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముఖ్యంగా పోలీసుల కళ్లగప్పి పారిపోవడాన్ని కోర్ట్ తీవ్రంగా పరిగణించింది. ఆయనకు రెండు వారాల పాటు రిమాండ్ విధిస్తూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్ట్ ఆదేశాల మేరకు పోలీసులు చింతమనేనిని జైలుకు తరలించనున్నారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఎగిరెగిరి పడ్డ చింతమనేని..ఆఖరికి జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చే అంటూ..దెందులూరు ప్రజల్లో చర్చ జరుగుతోంది.
