కశ్మీరీ ప్రజలకు కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ని రద్దు చేసి.. కశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ము, కశ్మర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ మోడీ సర్కార్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కశ్మీరీ అంశంపై 70 ఏళ్లుగా చలికాచుకుంటున్న పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో యాగీ చేసినా..ఆఖరికి ఐక్యరాజ్యసమితికి వెళ్లినా..కశ్మీరీ అంశం భారత అంతర్గత సమస్య,..అందులో జోక్యం చేసుకోమని ప్రపంచదేశాలు తేల్చి చెప్పాయి. దీంతో రగలిపోతున్న పాకిస్తాన్ ఉన్మాదంతో వ్యవహరిస్తోంది. ఉగ్రదాడులకు తెగబడి భారత్‌లో మారణ హోమం సృష్టించేందుకు పాకిస్తాన్ స్కెచ్ వేసింది.
తమ దేశంలో ఉన్న ఉగ్రవాదులను దగ్గరుండీ మరీ భారత్‌లోకి వివిధ రహస్య మార్గాల ద్వారా తరలిస్తోంది. కాగా దేశంలో పలు చోట్ల ఉగ్రదాడులు జరుగవచ్చుని కేంద్ర ఇంటలిజెన్స్ శాఖ కూడా చెప్పింది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉగ్రదాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు కేంద్ర భద్రతా విభాగం ప్రకటించింది. తాజాగా ఇండో – పాక్ వాస్తవాధీన రేఖను దాటి 40 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించినట్లు భద్రతా దళాలు చెబుతున్నాయి. గత కొద్ది రోజులుగా భారత పాకిస్తాన్ బోర్డర్ వెంబడి పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు చేసిన ప్రయత్నాలను తాము చాలావరకూ భగ్నం చేశామని జమ్ము, కశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అయితే ఈ ప్రక్రియలో కొంత మంది సరిహద్దును దాటి భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఆయన అన్నారు. దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా దళాలు సరిహద్దు వెంట నిఘాను ముమ్మురం చేశామని సింగ్ తెలిపారు.
ముఖ్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు పలు కీలక సైనిక స్థావరాలపై ముఖ్యంగా సౌత్ఇండియాపై ఉగ్రదాడులకు తెగబడేందుకు అవకాశం ఉందని..కేంద్ర ఇంటలిజెన్స్ సంస్థ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన‌్ నుండి 40 మంది ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా దళాల ప్రకటన భయాందోళనలను పెంచుతోంది. ఉగ్రవాదులు ఎనీ టైమ్ ఎటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి..ఇండియన్ ఆర్మీ, పోలీసుల సహాయంతో దేశమంతటా మరింత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. మొత్తంగా భారత్‌లోకి 40 మంది ఉగ్రవాదులు చొరబడిన వార్త దేశ ప్రజలందరిని కలవరపరుస్తోంది. అయితే ఎటువంటి దాడులనైనా ధీటుగా ఎదుర్కునేందుకు భారత భద్రతా దళాలు సిద్ధంగా ఉండడం ఊరట నిచ్చే విషయం.