నేడు పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీరవనిత…చాకలి ఐలమ్మ వర్థంతి. భూస్వాముల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా ఒంటరిగా యుద్ధమే చేసిన చాకలి ఐలమ్మ… 1919 వరంగల్ జిల్లా, రాయపర్తి మండలంలోని క్రిష్టాపురం గ్రామంలో జన్మించింది. చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఒక పక్క కుల వృత్తి చేసుకుంటూ కూడా… తమకు వున్న కొద్దిపాటి భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే మల్లంపల్లి భూస్వామి కొండలరావు భూములను ఐలమ్మ కౌలుకు తీసుకుని సాగు చేయడం పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరి రావుకు నచ్చలేదు. ఒక వెనుకబడిన కులానికి చెందిన ఓ మహిళ ఇలా సొంతంగా తన కాళ్ల మీద తాను బతకడం జీర్ణించుకోలేని పట్వారీ..కౌలు మానేసి తన పొలాల్లో పని చేయాల్సిందే అని ఐలమ్మపై వత్తిడి చేశాడు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఐలమ్మ వినకపోవడంతో ఆమె కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని… విసునూర్ దేశ్‌ముఖ్ రాపాక రాంచందర్రెడ్డికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆగ్రహించిన దేశ్‌ముఖ్ కుట్ర పూరితంగా రాజద్రోహానికి పాల్పడుతుందంటూ ఐలమ్మపై కేసు పెట్టాడు.. ఆ కేసులో కమ్యూనిస్ట్‌ల అగ్రనాయకులతోపాటు ఐలమ్మ కుటుంబాన్ని కూడా ఇరికించాడు. కానీ చివరకు కోర్టులో చాకలి ఐలమ్మతో పాటు కమ్యూనిస్ట్ నాయకులు నిర్దోషులుగా బయపడ్డారు.. ఆ నాటి నుండి ప్రజలకు చాకలి ఐలమ్మ ఒక ఐకాన్‌గా మారిపోయింది… అప్పటిదాకా దొరా నీ బాంచన్ అన్న అమాయక ప్రజల్లో ఆత్మవిశ్వాసం వచ్చింది..దొరల ఆగడాలను అడ్డుకుంటూ అక్కడక్కడా ధిక్కార స్వరాలు వినిపించడం మొదలైంది…దొరల పెత్తనాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మరో పక్క కమ్యూనిస్ట్ నాయకులు దొరల పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేవారు.
తన పెత్తనాన్ని ప్రశ్నిస్తుందనే కోపంతో ఐలమ్మపై దేశ్‌ముఖ పగబట్టాడు. వెంటనే పట్వారి సహకారంతో ఐలమ్మ కౌలుకు తీసుకున్న భూమిని తన పేరున రాయించుకుని ఆక్రమించుకున్నాడు. ఆ భూమిలో పండించిన ధాన్యమంతా తనదేనంటూ ఆ పంటను కోసుకుని రావాల్సిందిగా తన దగ్గరున్న 100 మంది గూండాలను పంపాడు. అంతే తన భూమిని, పంటను కాపాడుకోవటానికి సివంగిలా విరుచుకుపడింది చాకలి ఐలమ్మ.. రోకలిబండ చేతపట్టుకుని వచ్చిన గూండాలను తరమికొట్టింది. కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది. ఐలమ్మ వీరోచిత పోరాటంతో కమ్యూనిస్ట్‌లు మరింతగా విజృంభించారు…పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడిచేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు. దొరకు చెందిన 90 ఎకరాల దొర భూమిని స్వాధీనం చేసుకుని ప్రజలకు పంచారు. ఐలమ్మ భూపోరాటంతో తెలంగాణ సాయుధ పోరాటం ఊపందుకుంది. ఐలమ్మ భూపోరాటం మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాలవారు అమరులయ్యారు. 10 లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. అలా చాకలి ఐలమ్మ దొరలకు వ్యతిరేకంగా చేసిన వీరోచిత పోరాటం తెలంగాణ సాయుధపోరాటానికి నాందిగా నిలిచింది. చాకలి ఐలమ్మగా పేరుగాంచిన చిట్యాల ఐలమ్మ వయోభారంతో 1985 సెప్టెంబర్ 10న అనారోగ్యంతో మరణించింది. భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన ధీరవనితగా చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ వీర వనితకు దరువు.కామ్ ఘనంగా నివాళులు అర్పిస్తోంది.