భూ దందా కేసులో ఐదుసార్లు ఓడిపోయిన మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చుట్టూ భూదందా ఉచ్చు బిగుసుకుంది. గత ఐదేళ్ల పాలనలో సోమిరెడ్డి తనకున్న రాజకీయ పరపతి అడ్డుపెట్టుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు.. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టించి సహజ వనరులను దోచుకుని కోట్లకు పడగలెత్తారు. తన అరాచకాలను ప్రశ్నించిన అప్పటి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై అక్రమకేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేసారు. అప్పుడే కాకాణి ఇతను సోమిరెడ్డి కాదు సోదిరెడ్డి అంటూ ప్రత్యర్ధికి ఓ పేరు కూడా పెట్టేసారు. అయితే గతంలో వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసి నేతలను, కార్యకర్తలను పోలీస్ కేసులతో భయపెట్టి నరకం చూపించిన సోమిరెడ్డిపై ఎట్టకేలకు భూదందా కేసు నమోదైంది.
ఆయన దందాపై గతంలో పోలీసులు ఫిర్యాదు కూడా స్వీకరించేందుకు వెనకాడారు. అయితే బాధితులు కోర్టును ఆశ్రయించి కేసు నమోదు చేయాలని ఆదేశాలివ్వడంతో సోమిరెడ్డిపై కేసు నమోదైంది. గత నెల27న పలు సెక్షన్లకింద కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ నిమిత్తం హాజరుకావాలని సమన్లు జారీచేశారు. ఈ క్రమంలో సోమిరెడ్డి పోలీసు విచారణకు హాజరుకాకుండా ఆఖరిక్షణంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేరేవారి భూమిని తన భూమిగా చూపించి విక్రయించారు. ఇందులో భూయజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసారు. నెల్లూరు రూరల్ సర్కిల్ సీఐ రామకృష్ణ నోటీసును అల్లీపురంలోని సోమిరెడ్డి నివాసానికి వెళ్లి అందజేశారు. వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లి రెవెన్యూ డివిజన్ కింద ఫోర్జరీ పత్రాలతో సర్వే నెం .58-3లో 2.41 ఎకరాల భూమిని అమ్మడంపై సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డిపై ఎ1 గా కేసు నమోదైంది.
ఈ నేపధ్యంలో ఈ కేసుకు సంబంధించి గత సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సోమిరెడ్డి వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐ వద్దకు హాజరై అన్నీ డాక్యుమెంట్లు సమర్పిస్తారని ప్రచారం చేశారు. మరోగంటలో వస్తారనేలోపే విచారణకు హాజరు కాకుండా వేరే ఊరెళ్లిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చగా మారింది. చివరకు 6 గంటల సమయంలో సోమిరెడ్డి తరఫున ఇద్దరు న్యాయవాదులు వడ్డే శ్రీనివాసరావు, చలపతి సీఐ రామకృష్ణ వద్దకు హాజరై పలు డాక్యుమెంట్లను అందజేశారు. రాత్రి 8 గంటల వరకు సీఐతో చర్చించారు. డాక్యుమెంట్లు ఇచ్చినట్లు రసీదు ఇవ్వమని న్యాయవాదులు కోరడంతో ఇచ్చేందుకు వీలుకాదని సీఐ రామకృష్ణ చెప్పడంతో ఇచ్చిన డాక్యుమెంట్లను వెనక్కి తీసుకుని వెళ్లిపోయారు. కేసును ఎదుర్కొంటున్న సోమిరెడ్డి ఆఖరిక్షణంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం, తన న్యాయవాదులను పోలీసుల వద్దకు పంపడంతోపాటు ముందుస్తు బెయిల్ కోసం కోర్టును సైతం ఆశ్రయించడం, విచారణకు డుమ్మా కొట్టడం చూస్తే ఆయన వద్ద ఆధారాలు లేకపోవడం వల్లే అదృశ్యమైపోయారని అందరూ చర్చించుకుంటుండగా ప్రస్తుతం ఈయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియని పరిస్థితి.