పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పల రాజు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ తెల్ల రేషన్ కార్డు ఆయనపై వివాదం రేపింది. అయితే ఈ తెల్ల రేషన్ కార్డు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ప్రతిపక్షం కాదు స్వయంగా ఆయనే.. ఆయనే ప్రచారం చేసుకొని మరీ విమర్శలు ఎదుర్కొన్నారు. సాధారణంగా తెల్ల రేషన్ కార్డు పేదవారికి ఇస్తారు. అయితే ఎమ్మెల్యే కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి.
తాజాగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీర్లు డ్యూటీలో భాగంగా తెల్ల రేషన్ కార్డున్న ఎమ్మెల్యే కుటుంబానికి కూడా బియ్యంతో పాటు సరుకుల్ని అందించారు. దీనిపై ఎమ్మెల్యే ఏమీ ఆలోచించకుండాగ్రామ వాలంటీర్ వ్యవస్థ పనితీరు గురించి, రేషన్ సరుకుల నాణ్యత గురించి చెప్పేందుకు రేషన్ బియ్యం, సరుకులు తీసుకున్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఈ పోస్టు వైరల్ అవుతోంది. దాంతో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి తెల్ల రేషన్ కార్డు ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి.పేదలకు అందాల్సిన సరుకులు దుర్వినియోగం అవుతున్నాయని నెటిజన్లు వివాదరహితుడైన అప్పలరాజుపై మండిపడుతున్నారు. దీనిపై స్పందించిన అప్పలరాజు వివరణ ఇచ్చుకున్నారు.
తనకు తెల్లరేషన్ కార్డు ఉందన్న విషయం తెలియదని, తన కుటుంబసభ్యులకు కూడా సమాచారం లేదన్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వల్లే ఇది వెలుగులోకి వచ్చిందన్నారు. వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేస్తుందని, తాను తెల్ల రేషన్ కార్డుదారుడైతే ఇప్పటివరకూ తన రేషన్ ఏమైందని ప్రశ్నించారు. నెల నెలా రేషన్ అందనప్పుడు తెల్ల కార్డును ఎందుకు రద్దుచేయలేదని ప్రశ్నించారు. పాస్‌పోర్టు కోసం 2009లో రేషన్ కార్డు అవసరం వచ్చిందని అప్పుడు గులాబీ రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేయగా తెల్లకార్డు ఇచ్చారని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. తనకు కార్డు వచ్చిన తరువాత రెండు ప్రభుత్వాలు మారిపోయినా క్యాన్సిల్ లేదని, ఇప్పుడు క్యాన్సిల్ చేయాలని పలాస ఎమ్మార్వోకు చెప్పానని అప్పలరాజు వివరించారు. జరిగిన తప్పుకు వివరణ ఇచ్చి సరిదిద్దుకుంటున్నందుకు ఇప్పుడు ఎమ్మెల్యేను అందరూ అభినందిస్తున్నారు.