తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2019-20 ఏడాదికి చెందిన బడ్జెట్ ను సంక్షేమ పద్దు పేరుతో శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్,మండలిలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు నిన్న సోమవారం ప్రవేశ పెట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి,ఆస్తులను సృష్టించడంలో..సంక్షేమంలో.. మూలధన వ్యయంలో ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉండే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టి అమలు చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు గడపగడపకు చేరాయి. గతంలో సమైక్య రాష్ట్రంలో మూలధన వ్యయంలో కేవలం 11.2% మాత్రమే తెలంగాణ ఉండేది. నిధులు వినియోగంలో అప్పటి పాలకుల వివక్ష కారణంగా పెట్టుబడి వ్యయంలో తెలంగాణకు దక్కిన వాటా మరింత తక్కువగా ఉండేది.
తెలంగాణ ఆవతరించిన తర్వాత సర్కారు పాటిస్తున్న ఆర్థిక సంస్కరణలు .. విధానాల వలన మూల ధన వ్యయం క్రమక్రమంగా పెరుగుతూ ఈ రోజు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది అని అన్నారు .గతేడాది ఆర్థిక సంవత్సరంలో 16.9% మూల ధన వ్యయంతో రాష్ట్రం ముందువరుసలో ఉంది.ఇదే ఆర్థికసంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మూలధన వ్యయం కేవలం 12.89 శాతమైతే.. దేశంలోని అన్ని జనరల్ క్యాటగిరీ రాష్ట్రాల సగటు మూలధన వ్యయం 14.2% మాత్రమే.
సమైక్యపాలన చివరి పదేండ్లలో మూలధన వ్యయం కింద తెలంగాణ ప్రాంతంలో రూ.54,052 కోట్లు ఖర్చు పెడితే, తెలంగాణ ఏర్పడిన ఐదేండ్లలోనే రూ.1,03,551 కోట్లను ప్రజాసంక్షేమానికి వెచ్చించాం. బడ్జెట్ నిధులే కాకుండా, వివిధ ఆర్థికసంస్థల నుంచి సమీకరించిన నిధుల్లో రూ.65,616 కోట్లను మూలధన వ్యయంగా వినియోగించాం. అంటే గడిచిన ఐదేండ్లలో రాష్ట్రంలో జరిగిన మొత్తం మూలధన వ్యయం రూ.1,65,167 కోట్లు. సమైక్యరాష్ట్రంలో అభివృద్ధి పనులకు సగటున ఏటా రూ.5,400 కోట్లు ఖర్చుచేస్తే, తెలంగాణ రాష్ట్రంలో రూ.33,833 కోట్లకుపైగా ఖర్చుచేస్తున్నాం. అన్నిరంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి ఫలితంగా గడిచిన ఐదేండ్లలో తెలంగాణ 21.49% సగటు ఆదాయ వృద్ధిరేటు సాధించి, దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.