దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది.. ప్రభాకర్ కేసుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పోలీసులపై కూడా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఐ, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడగా తాజాగా పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి పై చర్యలు తీసుకున్నారు. ఆమెను ఏలూరు డీఐజీ సస్పెండ్ చేసారు. పోలవరం కుడి కాల్వ గట్టు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న కేసునుంచి చింతమనేని తప్పించారనే ఆరోపణలు రావడంతో కేసును సక్రమంగా విచారణ చేయలేదని ఆమెపై సస్పెన్షన్ వేటువేశారు. అలాగేపినకడిమికి చెందిన యువకులపై చింతమనేని దౌర్జన్యం చేశారని, ఇసుక తవ్వకాలకు సంబంధించిన వ్యవహారంలో తమను కులంపేరుతో దూషించి దాడికి ప్రయత్నించారని చింతమనేనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఆయనతోపాటు అనుచరులపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. అప్పటినుంచి చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు.. ఆయనకోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. స్పెషల్ టీమ్‌లు కూడా రంగంలోకి దిగి వెతుకుతున్నారు. చింతమనేని అరాచకాలకు బలైన బాధితులు ధైర్యంగా ముందుకువచ్చి ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ నవదీప్‌సింగ్ కోరారు. ఇప్పటికీ చాలామంది బాధితులు ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఏలూరు నగరంలో కూడా పోలీసులు భారీగా చింతమనేని ఇంటివద్ద మోహరించారు. పోలీసులు పెద్దసంఖ్యలో తన ఇంటికి చేరుకోవడంతో ఆరోజు చింతమనేని ఇంట్లో నుంచి బయటకు రాలేదు. విషయం తెలిసిన ఆయన అనుచురులు చింతమనేని ఇంటివద్ద హడావుడి చేశారు.
బయటకు వస్తే అరెస్టు చేస్తారనే భయంతో చింతమనేని రాకుండా తాత్సారం చేస్తూ మధ్యాహ్నం ఇంటినుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి, ఇక్కడికే వెళ్లొస్తా అంటూ పోలీసులకు చెప్పి జారుకున్నారు. అయితే ప్రభాకర్‌ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు అతడు కారులో వెళ్లిపోతున్నా చూస్తూనే ఉండిపోయారు. కళ్లముందే దర్జాగా కారులో వెళ్లిపోతున్నా పోలీసులు కనీసం అడ్డగించేందుకు ప్రయత్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల సహకారంతోనే చింతమనేని పరారైనట్టు తెలుస్తోంది. ఇంటినుంచి బయటకు రెండుకారుల్లో వచ్చిన చింతమనేని ఏలూరు జాతీయ రహదారిపైకి వచ్చి రెండు వైపులకు రెండు కార్లను పోనిచ్చి తికమకగా తప్పించుకున్నారు. ఆ సమయంలో ఇద్దరు ఎస్‌ఐలు సంఘటనా స్థలంలోనే ఉన్నా చింతమనేనిని అరెస్టు చేయాలని పో లీసుల ఆదేశాలు వచ్చినా ఓ ఇద్దరు ఎస్‌ఐలు చింతమనేనితో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. పోలీసుల కదలికలను వారే చేరవేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనిపై జిల్లాఎస్పీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట. కొందరు మాత్రం చింతమనేని తెలంగాణలో తలదాచుకుని ఉంటారని భావిస్తుంటే మరికొందరు విదేశాలకు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.