గంగా, జమునా తెహజీబ్ సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తోంది తెలంగాణ. రాష్ట్రమంతటా హిందూ, ముస్లింలు ఐక్యంగా ఉంటూ మతసామరస్యాన్ని చాటుతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరం వినాయక నిమజ్జనం నాడు ఊరేగింపుగా వచ్చే భక్తులకు ముస్లింలు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. అంతే కాదు గణేష్ మండపాల్లో లడ్డూ వేలంపాటల్లో ముస్లింలు కూడా పాల్గొని లడ్డూని దక్కించుకుని హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదరభావాన్ని చాటుతున్నారు. ఇక ముస్లిల ఉర్సు ఉత్సవాలు, దర్గాల జాతరలో హిందూవులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాగా హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనంగా బాసర సరస్వతీ క్షేత్రం నిలుస్తోంది. తాజాగా చదువుల తల్లి కొలువైన బాసర సరస్వతీ క్షేత్రంలో ఒక ముస్లిం చిన్నారికి అక్షరాభాస్యం చేయించారు అతడి తల్లిదండ్రులు. శనివారం నాడు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం కుటుంబం చదువుల తల్లి సరస్వతి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారి సన్నిధిలో హిందూ సంప్రదాయం ప్రకారం, శాస్త్రోక్తంగా తమ చిన్నారికి అక్షరాభాస్యం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ముస్లిం కుటుంబం మాట్లాడుతూ..గత కొన్నేళ్లుగా తాము అమ్మవారిని దర్శించుకుంటున్నామని తెలిపారు. చదువుల తల్లి అయిన సరస్వతి క్షేత్రంలో తమ చిన్నారికి అక్షరాభాస్యం చేయిస్తే మంచిగా చదువు వస్తుందనే నమ్మకంతో ఇక్కడకు వచ్చామని వారు చెప్పారు. కాగా ముస్లిం చిన్నారి అక్షరాభాస్యాన్ని గమనించిన భక్తులు ఆ కుటుంబాన్ని అభినందించారు. సరస్వతీ ఆలయంలో జరిగిన ఈ సంఘటనపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. బాసరలో తమ చిన్నారికి అక్షరాభాస్యం చేయించడం ద్వారా ఆ కుటుంబం హిందూ, ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది.
