ఏపీలో పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను వినియోగించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 100 శాతం నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రకటించారు.అయితే ఈ పైలెట్ ప్రాజక్ట్‌ను ప్రారంభించి గంట కూడా కాకముందే లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ రచ్చ చేయడం మొదలుపెట్టింది. పేదలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పి… గడ్డకట్టిన బియ్యం ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. ప్రభుత్వం సదుద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుపై లోకేష్ టీం చేస్తున్న దుష్ప్రచారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. పచ్చపార్టీ దొంగలు ఆ బియ్యం బస్తాలలో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంటలోపలే క్షుద్రదాడి మొదలు పెట్టారు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మాలోకం అంటూ లోకేష్‌పై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
