అన్ని రకాల పదవులకు పూర్తి స్థాయిలో భర్తీ చేసి, ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శనివారం ప్రభుత్వ విప్ ల నియామకాన్ని ఖరారు చేసిన ముఖ్యమంత్రి, ఆదివారం సాయంత్రం మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. త్వరలోనే కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా భర్తీ చేయాలని సిఎం నిర్ణయించారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించే ఆలోచనలో సిఎం ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన పార్టీ సీనియర్ నాయకులు మధుసూదనా చారి, జూపల్లి కృష్ణారావు లకు త్వరలోనే ఉన్నత పదవులు ఇవ్వాలని సిఎం నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహరెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తదితరులకు కూడా ఉన్నతమైన పదవులిచ్చి ప్రభుత్వ యంత్రాంగంలో కీలకపాత్ర పోషించేలా చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. వీరిలో కొందరికి రాజ్యసభ సభ్యత్వం, మరికొందరికి ఆర్టీసీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ లాంటి పదవులు దక్కే అవకాశం ఉంది.
ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని మరింత బలీయమైన శక్తిగా మార్చే దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. పార్టీ కమిటీలను నియమించడం, పార్టీ కార్యాలయాలను నిర్మాణం త్వరలోనే పూర్తి చేసుకోవాలని నిర్ణయించారు.
అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ వారికి మరిన్ని మంచి అవకాశాలు కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేసే యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలని సిఎం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.