తెలంగాణ కేబినెట్ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావుకు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ వేదికమీదకు రాగానే జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు, నేతల నినాదాలతో రాజ్‌భవన్ దద్దరిల్లింది.నూతన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ కేటీఆర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కల్వకుంట్ల తారక రామరావు అనే నేను అంటూ కేటీఆర్ ప్రమాణ స్వీకారం మొదలు పెట్టారు. కేటీఆర్ ప్రమాణ స్వీకారం ఆయన మాటల్లోనే వినండి.
కల్వకుంట్ల తారకరామారావు అనే నేను..!
శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల
నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని
భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని,
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో,
అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని..
భయం కాని, పక్షపాతం కాని, రాగ ద్వేషాలు కాని లేకుండా..
రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ
న్యాయం చేకూరుస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
కల్వకుంట్ల తారకరామారావు అనే నేను..!
తెలంగాణ రాష్ట్రమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా
నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను
సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పా,
ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు
తెలియపర్చనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో
ప్రతిజ్ఞ చేస్తున్నాను.
అని కేటీఆర్ ప్రమాణ పూర్తి చేసి అనంతరం సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. కేటీఆర్ ప్రమాణ స్వీకారంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.