దెందులూరు మాజీ ఎమ్మెల్యే , ఏపీ రాజకీయాల్లోనే అత్యంత వివాదస్పద నేత చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలో ఉన్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్‌ల అండతో చింతమనేని అరాచకం సృష్టించాడు. ముఖ్యంగా ఇసుక మాఫియాను అడ్డుకుందనే కోపంతో ఎమ్మార్వో వనజాక్షిని జుట్టుపట్టుకుని లాగి కొట్టిన ఘనుడు ఈ చింతమనేని. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయిన ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే చంద్రబాబు ఎమ్మార్వో వనజాక్షిని పిలిపించి, ఆమెకు చింతమనేనితో క్షమాపణలు చెప్పించకుండా…అసలు నువ్వు ఎందుకు ఆయన ఇలాకాలో జోక్యం చేసుకున్నావు..నీదే తప్పు అంటూ చివాట్లు పెట్టి పంపించాడు. ఇలా చంద్రబాబు అండతో చింతమేనేని జిల్లాలో రాక్షస కాండ కొనసాగించాడు. ప్రత్యర్థులపై భౌతికదాడులు, దళితులపై దౌర్జన్యాలు..ఇసుక దందా, ల్యాండ్ మాఫియా, కాంట్రాక్టుల్లో అవినీతి, అక్రమాలు..ఇలా దోపిడీకి అనర్హం ఏదీ కానట్టుగా చింతమనేని చెలరేగిపోయాడు. అయితే ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదర చేతిలో ఓడిపోయిన తర్వాత చింతమనేని అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తాజాగా అట్రాసిటీ కేసులో అరెస్ట్‌కు భయపడి చింతమేని పారిపోయాడు. పెద్ద పెద్ద కరడు గట్టిన నేరస్థులు తప్పించుకున్నట్లుగా పోలీసుల ముందే వాళ్ల కళ్లు గప్పి మరీ చింతమేని పారిపోవడం సంచలనంగా మారింది. చింతమనేనిని పరారీ అయిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్థానిక పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే చింతమనేనిపై నమోదైన నేరాల వివరాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఆరా తీయగా…విస్తు పోయే నిజాలు బయటపడ్డాయని తెలుస్తోంది. చింతమనేనిపై మొత్తం 50కు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే టీడీపీ హయాంలో సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్‌ల సహకారంతో దాదాపు 23 కేసులు ఎత్తివేయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాదు అని భావించిన చింతమనేని చంద్రబాబు, లోకేష్‌ల సహకారంతో పోలీస్ ఉన్నతాధికారులపై ఒత్తిడి చేయించి ఈ కేసులన్నీ మాఫీ చేయించుకున్నట్లు సమాచారం.
ముఖ్యంగా ఎమ్మార్వో వనజాక్షి కేసును కూడా తప్పుడు కేసు అంటూ ఎన్నికలకు 3 నెలల ముందే అంటే ఫిబ్రవరిలోనే పోలీసులు ఎత్తివేసారని తెలుస్తోంది. ఈ కేసును ఎత్తివేసే విషయంలో కనీసం ఫిర్యాదు చేసిన వనజాక్షికిగాని, కోర్టుకు కానీ సమాచారం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసుతో పాటు ఏఎస్‌ఐపై దాడి కేసును, ఏలూరు పోలీస్‌స్టేషన్‌లో చింతమనేని దౌర్జన్యం చేసిన కేసులను కూడా తప్పుడు కేసులంటూ రహస్యంగా ఎత్తివేశారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కేసుల ఎత్తివేతలో చంద్రబాబు ఆదేశాల మేరకు బాబు సామాజికవర్గానికే చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి సహకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. చింతమనేనిపై ఎత్తివేసిన కేసులన్నీ మళ్లీ రీఓపెన్ చేయించి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేసుల ఎత్తివేతకు సహకరించిన సదరు పోలీస్ ఉన్నతాధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న చింతమనేని త్వరలో అరెస్ట్ చేసి, నమోదైన అన్ని కేసుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని పోలీసులు భావిస్తున్నారు. మొత్తంగా టీడీపీ అధికారంలో ఉన్న చివరి రోజుల్లో చింతమనేని ఇలా సగం కేసులు ఎత్తివేయించుకున్న విషయం బయటకు వచ్చింది. దీంతో అమ్మ చంద్రబాబు..చింతమనేనిపై కేసులు ఎత్తేయించావా…నీకు ఎందుకో అంత ప్రేమ అంటూ నెట్‌జన్లు పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు.