రెండవ సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేటీఆర్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. గత ప్రభుత్వంలో చేనేత మరియు జౌళి శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్రంలో చేనేత వస్త్రాల పట్ల మరింత అవగాహన పెంచేందుకు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని “హ్యాండ్లూమ్ మండే” కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అప్పటినుంచి సమావేశం ఏదైనా ఖచ్చితంగా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరిస్తూ వస్తున్నారు. దీంతోపాటు పండగలు, తన జన్మదినం వంటి ప్రత్యేక సందర్భాల్లోనూ చేనేత వస్త్రాలను ధరించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కేటీఆర్, కీలకమైన మంత్రి వర్గ ప్రమాణ స్వీకారానికి చేనేత వస్త్రాలు ధరించి వచ్చారు. ఈరోజు ఆదివారం అయినప్పటికీ చేనేత వస్త్రాలు ధరించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యారు. ఈ విధంగా చేనేత వస్త్రాల పైన తనకున్న మక్కువను, వాటి పట్ల అవగాహన పెంచేందుకు తాను చేస్తున్న ప్రయత్నం పట్ల నిబద్ధతను చాటుకున్నారు.
