దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ కేసు విషయంలో ఓ మహిళా పోలీసు అధికారి సస్పెన్షన్ వేటుకు గురయ్యింది. గతంలో పెదవేగి ఎస్సైగా పనిచేసిన క్రాంతి ప్రియను సస్పెండ్ చేస్తూ ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె ప్రస్తుతం కంట్రోల్ రూంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు.ఈ కేసుల్లో చింతమనేనికి అనుకూలంగా వ్యవహరిస్తూ కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసుల అధికారులు, సిబ్బందిపై పోలీసు ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో పెదవేగి మండలం భోగాపురంలో పోలవరం కుడికాలువ గట్టుపై అక్రమంగా గ్రావెల్ తవ్వుతుండగా సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు అక్కడకు వెళ్లి రెండు పొక్లెయిన్లు, ట్రాక్లర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న చింతమనేని, అతని అనుచరులు అక్కడకు వచ్చి విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం చేయటంతోపాటు, అర్థరాత్రి వరకూ నిర్బంధించారు.
దీనిపై అప్పటి విజిలెన్స్ ఎస్పీ అచ్యుతరావు ఆదేశాల మేరకు అధికారులు పెదవేగి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటి పెదవేగి ఎస్సై క్రాంతిప్రియ నిర్లక్ష్యంగా కేసు నమోదు చేయకపోవటంపై పోలీసు ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎస్సై విధులను సక్రమంగా నిర్వర్తించలేదని నిర్థారణ కావటంతో ఏలూరు రేంజ్ డీఐజీ ఎస్‌ఏ ఖాన్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చింతమనేనితో టచ్‌లో ఉన్న ఒక ఎస్సైపైనా వేటు పడే అవకాశాలున్నాయి.