మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు.
అయినా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వందరోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల్లో పింఛన్లపెంపుపై తొలి సంతకం చేసారు.. అవ్వాతాతలకు వృద్ధాప్య పింఛన్ ఏకంగా రూ. 2,250కు పెంచారు. ఏటా రూ.250 చొప్పున పెంచుతూ రూ.3000 వరకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.. అలాగే ఫించను పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గించారు. దీంతో అదనంగా 5లక్షల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుంది. అలాగే కిడ్నీ బాధితులకు నెలకు రూ.10 వేల పింఛన్. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు గురైన బాధితులకు పింఛన్లు ఇచ్చే పథకంపై సమాలోచన జరుపుతున్నారు.