మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారానికొచ్చాక ఐదేళ్ల కాలంలో పూర్తిచేయాలని అందరు రాజకీయ నాయకులు అనుకొంటారు.
అయినా అన్నీ చేయరు.. ఐదుసార్లు అధికారానికొచ్చిన తెలుగుదేశం పార్టీ కానీ, చాలాసార్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కానీ తామిచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేకపోయాయి.. అయితే తన ప్రమాణస్వీకార సభలో జగన్ తాను రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు సెప్టెంబర్ 6వ తారీఖుతో జగన్ పాలనకు వందరోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల్లో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేసారు.
పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.18,000కు పెంపు. ఆశా వర్కర్ల జీతాలు రూ.10 వేలకు పెంచారు. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలు రూ.10,500 నుంచి రూ.11,500కు పెంచారు. ఆయాల జీతం రూ.6 వేల నుంచి రూ.7 వేలకు పెంచారు. డ్వాక్రా యానిమేటర్లు, రిసోర్స్ పర్సన్‌ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంపునకు నిర్ణయించారు. గిరిజన తండాల్లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4,000కు పెంచారు. హోంగార్డుల వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.