టీడీపీలో ఉన్నా…చంద్రబాబు, లోకేష్‌లపై, ఇతర టీడీపీ నేతలపై తనదైన యాసలో సెటైర్లు వేయడంలో అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తర్వాతే ఎవరైనా. గత ఐదేళ్లలో కూడా జేసీ పలుమార్లు అధినేత చంద్రబాబుతో సహా, ప్రత్యేక హోదా, పోలవరం ఇత్యాది అంశాలపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై డైరెక్ట్‌గా విమర్శలు చేసి ఇరుకున పెట్టేవారు. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న జేసీ…టీడీపీ ఘోర ఓటమి తర్వాత మీడియా ముందుకు పెద్దగా రాలేదు. తాజాగా సీఎం జగన్ పాలన 100 రోజుల పాలనపై జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. జగన్ 100 రోజుల పాలనకు వందకు వంద మార్కులు పడాల్సిందే..అవసరమైతే 110 మార్కులు వేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అప్పుడే జగన్ పాలన గురించి వ్యాఖ్యానించడం తొందరపాటు అవుతుందని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా జగన్ మావాడే అని జేసీ స్పష్టం చేశారు. మా జగన్ తెలివైన వాడు అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం జగన్ కిందా మీద పడుతున్నాడు… లేస్తున్నాడు. అయితే జగన్‌ను నడిపించేందుకు ఒక వ్యక్తి కావాలి… ఒక వేళ జగన్ తన సలహాలు కోరితే..అప్పుడు ఆలోచిస్తానని జేసీ చెప్పుకొచ్చారు.
ఇక రాజధాని తరలింపు వివాదంపై కూడా జేసీ స్పందించారు. రాజధాని తరలిపోతుందంటూ మావాళ్లు చేస్తున్న విమర్శలు అర్థంపర్థంలేదని, రాజధాని అమరావతిలోనే ఉంటుందని, ప్రతిదాన్ని మైక్రోస్కోపులో చూసి నేలకేసి కొట్టకూడదని పరోక్షంగా చంద్రబాబు, లోకేష్ టీడీపీ నేతలకు చురకలు అంటించారు. అలాగే ఆర్టీసీ విలీనం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారుతుందని జేసీ అభిప్రాయపడ్డారు. కాని గ్రామ సచివాలయం వ్యవస్థ ఇంకా పూర్తి స్థాయిలో ఏర్సడిన తర్వాత మాట్లాడితే ఏం బాగుంటుంది..ఈ లోగానే విమర్శలు చేస్తే ఎలా… పాపం మా జగన్ని ఊపిరి పీల్చుకోకుండా చేస్తున్నారు..ఏం మనుషులు వీళ్లు అంటూ సొంత పార్టీ నేతలపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. మొత్తంగా మా వాడికి అంటే జగన్‌కు, రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. జగన్ పాలన 100 రోజులు పూర్తి కాకుండానే చంద్రబాబు, లోకేష్‌లతో సహా, టీడీపీ నేతలు అవనసరంగా ప్రతి విషయంలో రచ్చ చేస్తున్నారనే అర్థం వచ్చేలా జేసీ వ్యాఖ్యలు ఉన్నాయి. జగన్‌కు టైమ్ ఇవ్వకుండా ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా చేస్తున్నారు..ఏం మనుషులు వీళ్లు అంటూ పరోక్షంగా చంద్రబాబు, లోకేష్‌లను జేసీ టార్గెట్ చేసి మాట్లాడినట్లుగా టీడీపీలో చర్చ జరుగుతోంది. జేసీ వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.