మనలో చాలా మంది ముఖ్యంగా యూత్ ఒక్కసారైనా గోవా వెళ్లాలని, అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అయితే చాలా మంది ఖర్చు ఎక్కువ అవుతుందని వెనుకాడుతారు. అయితే తెలంగాణలో మినీ గోవాకు వెళ్లండి..సేమ్ టు సేమ్ గోవా బీచ్లోలాగే ఎంజాయ్ చేస్తారు..నాదీ గ్యారంటీ…ఇంతకీ ఈ తెలంగాణ మినీ గోవా ఎక్కడ ఉందంటారా..అయితే ఛలో మిమ్మల్ని తెలంగాణ మినీ గోవాకు తీసుకువెళతాను..ఒకపక్క ఆధ్యాత్మిక దేవాలయాలు, మఠాలు, ప్రాచీన మానవుడి ఉనికిని చాటే నిలువు రాళ్లు, మరోపక్క గలగలా పారుతున్న కృష్ణానది, నదీ ప్రవాహంతో ఏర్పడిన ఇసుకమేటలతో.. అచ్చం గోవాను తలపిస్తున్న ఈ ప్రాంతం..నారాయణపేట జిల్లా, కృష్ణ మండలంలోని ముడుమాల్ గ్రామం. తెలంగాణలోనే చారిత్రక, ఆధ్యాత్మిక కేత్రంగా ఈ ముడుమాల్ గ్రామం ప్రసిద్ధిగాంచింది. ఈ గ్రామంలో ఉన్న నిలువురాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసినవిగా పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు 3000 ఏళ్ల క్రితం ఈ నిలువురాళ్ల నీడ ఆధారంగానే అప్పటి ప్రజలు రుతువులు, కాలాలను గుర్తించే వారని పరిశోధకులు చెబుతున్నారు. ఆదిమానవుల ఊహాశక్తికి, మేధస్సుకు ఈ నిలువురాళ్లు ఒక చిహ్నమని , ఆసియాలోనే ఇవి అత్యంత అరుదైన గండ శిలలు అని చెబుతున్నారు. వీటిని బృహత్ శిలాయుగం నాటి చారిత్రక సంపదగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.ఇక్కడ ఆధ్యాత్మికతను, ప్రశాంతతను చాటుతున్న యాదవేంద్రస్వామి మఠం, శివాలయాలు ఉన్నాయి. స్వయంగా మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి..ఇక్కడ తపస్సు ఆచరించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. గురు రాఘవేద్ర స్వామి సమకాలికుడే ఈ యాదవేంద్రస్వామి అని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆదిమానవులు, రుషులు, దేవతలు నడియాడిన ప్రాంతంగా ముడుమాల్ గుర్తింపు పొందింది. అలాగే ఈ గ్రామాన్ని గతంలో రాజులు, సంస్థానాధీశులు పరిపాలించారు. అప్పటి సంస్థానాధీశులు ఇక్కడి పేద ప్రజలకు వేలాది ఎకరాల భూములను ఇనాంగా ఇచ్చారు. ఇక బీచ్ గురించి చెప్పుకుంటే కృష్ణానది, ఆ నది పక్కన ఏర్పడిన ఇసుకమేటల ప్రాంతం.. సరిగ్గా గోవాలోని బీచును తలదిన్నే విధంగా ఉంది. దీంతో ముడుమాల్ గ్రామం అద్భుత చారిత్రక, పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడికి ప్రతినిత్యం కర్ణాటక నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇంతటి విశిష్టమైన ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించి గోవా బీచ్ తరహాలో అభివృద్ధి చేస్తే తెలంగాణ మినీగోవాగా ముడుమాల్ గ్రామం విలసిల్లుతుందనడంలో సందేహం లేదు.
