తెలంగాణలోని కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ”నిజనిజాలను పక్క త్రోవపట్టించి.. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినట్లుగా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
ఆయన ఈ రోజు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకుంటున్న చర్యలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ప్రతిపక్షాల తీరుపై నిప్పులు చెరిగారు. నగరంలో వైద్యులంతా అప్రమత్తంగా ఉన్నారని…ఆదివారం కూడా వైద్యసేవలు అందిస్తున్నారని తెలిపారు.
వాతావరణం మార్పుతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయని తెలిపారు. విష జర్వాలను అదుపు చేయడానికి వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. దేశంలోనే బెస్ట్ మెడికల్ సేవలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని హితవు పలికారు