ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కిడ్నీ బాధితులకు స్టేజ్3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న 10వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్3లో ఉన్నవారికి కూడా రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతోపాటు వారికి ఉచిత బస్ పాసులు అందజేస్తామన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ ఆసుపత్రికి జగన్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ పాదయాత్రలో చెప్పినట్లుగా కిడ్నీ బాధితుల కష్టాలు తీరుస్తానన్న మాటను ఈరోజు నిలబెట్టుకున్నానని చెప్పారు.
ప్రజల ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని, తమ పార్టీని 151 స్థానాల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిగా వందరోజుల పాలన ముగించుకుని మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్కో హామీని నెరవేరుస్తున్నందుకు తనకు ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు రూ.10వేల పెన్షన్ ఇచ్చే ఫైలుపై తొలిసంతకం చేశానని గుర్తుచేశారు. కిడ్నీ బాధితులకోసం నిర్మిస్తున్న ఆస్పత్రిలో ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని జగన్ తెలిపారు. కిడ్నీ బాధితులకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని, నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తామన్నారు. సమస్యకు మూల కారణాన్ని అన్వేషించి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉద్ధానం ప్రాంతమంతా మంచినీటి సరఫరాకు శ్రీకారం చుట్టామన్నారు. పలాస, ఇచ్చాపురం మొత్తం అన్ని గ్రామాల్లో నేరుగా ఇంటి వద్దకే తాగునీటిని అందించే కార్యక్రమానికి కూడా జగన్ శంకుస్థాపన చేసారు. అడగకుండానే అన్ని సమస్యలనూ తీర్చుతున్న ముఖ్యమంత్రిని ఎన్నుకుని ఎంతో మంచిపని చేసామంటూ సిక్కోలు ప్రజలు చెప్తున్నారు.