తెలంగాణ రాష్ట్రంలో పల్లెల ప్రగతి ఆరంభమవుతున్నది. ఏండ్ల తరబడి వెనుకబడి, కంపుకొట్టే మురికికాల్వలు, గతుకుల రోడ్లతో ఉండే గ్రామాలకు మంచిరోజులు వచ్చాయి. పల్లెల ప్రగతికోసం సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న 30 రోజుల ప్రణాళిక శుక్రవారం అధికారికంగా మొదలుకానున్నది. ప్రతి గ్రామానికి నియమితులైన స్పెషలాఫీసర్లు ఉదయం గ్రామాల్లో సభ నిర్వహించి, సీఎం కేసీఆర్ సందేశాన్ని వినిపిస్తారు. అనంతరం ఊరంతా తిరిగి పనులను గుర్తించనున్నారు. వాటిపై నివేదిక సిద్ధంచేసి, నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించి, గుర్తించిన పనులు, ముందుగా చేయాల్సినవాటిని వివరిస్తారు.
శనివారం గ్రామాల్లో గ్రామకమిటీలు, కో ఆప్షన్ సభ్యుల ఎంపిక తర్వాత ఆదివారం లేదా సోమవారం నుంచి తొలి ప్రాధాన్యపనులను మొదలుపెట్టనున్నారు. మొత్తం ఐదారు నెలల్లో గ్రా మాలను సస్యశ్యామలంగా తీర్చిదిద్దనున్నారు. గ్రామాల్లో పబ్లిక్‌రోడ్లు, మురుగుకాల్వలు, అడవుల నిర్వహణ, మట్టికుప్పలు, శిథిలాలు, పిచ్చిమొక్కల తొలిగింపు, వీధిదీపాల నిర్వహణ వం టి అంశాలను ప్రాధాన్యక్రమంలో చేపడుతారు. మరోవైపు రాష్ట్రంలోని పంచాయతీలకు ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 7312 కోట్లు రానున్నాయి. సగటున ఒక్కో పం చాయతీకి రూ.8 లక్షలు అందనున్నాయి. ఉపా ధి నిధులు కూడా ఈసారి ఎక్కువగానే వినియోగించుకునే అవకాశం ఉన్నది. అంతేకాకుండా స్వీయ ఆదాయం ద్వారా 500 జనాభా ఉన్న పంచాయతీలకు నెలకు లక్ష, పెద్ద పంచాయతీలకు రూ.4 నుంచి రూ.5 లక్షలు రానున్నాయి.
పది మొక్కలైనా… 85% బతుకాల్సిందే
గ్రామాల్లో నాటినవాటిలో 85 శాతం మొక్కలను సంరక్షించాల్సిందే. అయితే కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అధికారులపై వేటువేస్తారని, చర్యలు తీసుకుంటారని అర్థంలేని ప్రచారం చేస్తున్నారు. ఒక గ్రామంలో 10 మొక్కలైనా.. 100 మొక్కలైనా సరే.. వాటిలో 85 శాతం సంరక్షించాల్సిందేనని అధికారులు స్పష్టంచేస్తున్నారు. వెయ్యి మొక్కలు నాటి, పది మొక్కలను బతికించడంకాదని.. నాటే పది మొక్కలైనా బతికించాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది.
స్వీయ ఆదాయం తప్పనిసరి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే నిధులతోపాటు పంచాయతీలు స్వీయ ఆదాయాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం 500లోపు జనాభా ఉన్న పం చాయతీలకు కనీసం రూ.లక్ష స్వీయ ఆదా యం, మేజర్ పంచాయతీలకు రూ.4 నుంచి రూ. 5 లక్షల వరకు వస్తుందని తేల్చారు. గ్రామపంచాయతీ విధించే పన్నులు, ఇంటి పన్నులు, ప్రత్యేక పన్ను, ఫ్యాక్టరీలుంటే ప్రైవేట్ పన్నులు, వాటర్ ట్యాక్స్, జాతరలు, తీర్థయాత్రల పన్ను లు, వ్యాపార లైసెన్సులు వసూలుచేయాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని పంచాయతీలన్నింటికీ సగటున రూ.8 లక్షల వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయని ప్రభుత్వం వివరిస్తున్నది. దీనిపై ఇప్పటికే మండలాలవారీగా లెక్కలను ప్రకటించారు.
Source: #NamastheTelangana