సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ మరింత బలహీన పడుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎక్కడ కాలు పెడితే ఆ జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతోంది. తాజాగా విశాఖలో లోకేశ్ పర్యటన ప్రారంభంలో ఆ జిల్లాకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంకంటే తెలుగుదేశమే నాకు ప్రాధాన్యత అని తెలుగు దేశానికి పూర్వవైభవం తీసుకొచ్చే బాధ్యత ప్రతీ తెలుగుతమ్ముళ్లపై ఉందని ఇటీవల అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చినా ఆమాటను ఏమాత్రం లెక్కచేయకుండా సన్యాసిపాత్రడు టీడీపీని వీడారు.
టీడీపీ విధానాలు నచ్చకపోవడం, భవిష్యత్తులోనూ టీడీపీ పుంజుకునే అవకాశం లేకపోవడంతో కచ్చితంగా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారట. భారీగా తన అనుచరులతో వైసీపీలో చేరారు ఆయన.. ఈక్రమంలో ఇప్పటికే పార్టీకి ఏమాత్రం బలం లేని విశాఖ వలసలతో వణికిపోతుంది. వైసీపీలోకి మరిన్ని చేరికలు ఉండడంతో టీడీపీ మరింత బలహీనపడుతుంది. అదే కోవలో తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారైందో లేదో మరికొందరు టీడీపీ సీనియర్లు ఆపార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాపు సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులు వైసీపీలో చేరుతున్నారు..
తాజాగా ఆయన సీఎం జగన్‌ను కూడా కలిసారట. టీడీపీ అధినేత చంద్రబాబు ఆపాలని ప్రయత్నిస్తున్నా త్రిమూర్తులు స్పందించలేదట. అలాగే జిల్లా సమీక్ష సమావేశానికి రావాలని చంద్రబాబు వద్ద నుంచి పిలుపు వచ్చినా ఆయన పట్టించుకోలేదట. గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి టీడీపీ తరుపున పోటీచేసి తోట ఓడిపోయారు. రామచంద్రాపురం నుంచి తోట నాలుగుసార్లు గెలిచారు. అయితే చంద్రబాబు ఫోన్లు చేసినా త్రిమూర్తులు సహా పార్టీ నేతలెవ్వరూ ఎవ్వరూ స్పందించట్లేదట..వీరు కూడా టీడీపీని వీడితే జిల్లాలో ప్రధాన న్యాయకత్వం మొత్తం ఖాళీ అయిపోయినట్టే కనిపిస్తోంది. మొత్తంగా లోకేశ్ చంద్రబాబులు ఏ జిల్లాలో కాలు పెడితే అక్కడి అగ్ర నాయకులు పార్టీ మారడంతోపాటు ద్వితియశ్రేణి మొత్తం వైసీపీ వైపు చూస్తోందట.