ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. జగన్ నీచాతి నీచమైన రాజకీయం చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతటి రాక్షసపాలన చరిత్రలో తాను చూడలేదనన్నారు. ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఇలా ప్రవర్తించలేదన్నారు. వైఎస్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను కడపలోనే చేసేవారని తెలిపారు. జగన్ కక్షపూరిత రాజకీయాలకు శ్రీకారం చుట్టారన్నారు. పులివెందుల పంచాయితీని రాష్ట్రమంతా రుద్దాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. 2014ఎన్నికల్లో కడప రౌడీయిజానికి నిరసనగా విశాఖప్రజలు విజయలక్ష్మిని ఓడించారన్నారు.
రాష్ట్రంలో విధ్వంసం నడుస్తోందని, తననుకూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్నారు. తన పర్యటనలకు భద్రత తగ్గించి ఇబ్బందిపెడుతున్నారని వివరించారు. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో రౌడీలను తయారు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రానికి పెట్టుబడిదారులెవరూ రారని, రాచరికంలోనూ ఇంత మొండితనం ఉండదేమో అన్నారు.పోలీసులకు కూడా అత్యుత్సాహం ఎక్కువైందని, అది మంచిదికాదని హితవు పలికారు.