యావత్ ప్రపంచం భారతదేశంవైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. చంద్రయాన్ – 2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఈ రోజు అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌ను గురువారం నాటికి చంద్రుడికి 35 కిలోమీటర్లు దగ్గరగా.. 101 కిలోమీటర్లు దూరంగా ఉండే కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్బిటర్ చంద్రుడికి 96 కిలో మీటర్లు దగ్గరగా..125 కిలోమీటర్లు దూరంగా ఉండే చంద్రకక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇక మిగిలింది ల్యాండర్ విక్రమ్‌ను చంద్రుడిపై దించడమే. ఈ తుది ఘట్టం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. విక్రమ్ ల్యాండర్‌ను శనివారం తెల్లవారుజామున ఒంటి గంట 55 నిమిషాలకు చంద్రుడిపైకి విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత.. అంటే ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర గంటల మధ్య అందులోంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి 14 రోజులపాటు పరిశోధనలు చేయనుంది. ఆ సమయంలో అది విక్రమ్ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్‌కు చేరవేస్తుంది. విక్రమ్ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్ డీప్‌స్పేస్ నెట్‌వర్క్‌కు అందుతుంది. కాగా విక్రమ్ ల్యాండింగ్‌ను స్వయంగా ప్రధాని మోదీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి తిలకించనున్నారు.
