దేవ భూమిగా పిలువబడే హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర కులూవ్యాలీ ప్రాంతం అరుదైన శైవ క్షేత్రంగానే కాకుండా పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. ఈ కులూ వ్యాలీలో ఉన్న బిజిలీ మహాదేవ్ మందిర్‌లో పరమశివుడు మహదేవ్‌గా భక్తులచే పూజలందుకుంటున్నాడు. అయితే ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ మహదేవ్ మందిర్‌పై పిడుగుపడి ముక్కలైన శివలింగం..తిరిగి మరుసటి రోజుకల్లా అతుక్కోవడం ఈ బిజిలీ మహదేవ్ మందిరం ప్రత్యేకత. ఇంతటి అద్భుతం దేశంలో మరెక్కడా చూడలేం..పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రతి 12 ఏళ్లకు సరిగ్గా బిజిలీ మహదేవ్ మందిరంపై పిడుగుపడుతుంది. అయితే పిడుగు తీవత్రకు మందిరం మాత్రం చెక్కుచెదరదు. కేవలం శివలింగం మాత్రమే ముక్కలవుతుంది. మరుసటి రోజు ఆ గుడికి వెళ్లిన పూజారి తునాతునకలైన ఆ ముక్కలను ఒక్కచోటికి చేర్చి అభిషేకం చేస్తారు. మరుసటి రోజుకు ముక్కలైన శివలింగం తిరిగి యధారూపంలోకి వచ్చేస్తుంది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే అద్భుతం ఇది. ఇది ఎలా జరుగుతుందో శాస్త్రజ్ఞులు కూడా ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
ఇలా పిడుగుపడి ముక్కలైన శివలింగం..మరుసటి రోజుకల్లా యధావిధిగా కనిపించడం వెనుక ఓ పురాణగాథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కులూ వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు ఉండేవాడట. ఈ వ్యాలీలో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే అక్కడి ప్రజలను, పశుపక్షులను నాశనం చేయడానికి ఆ రాక్షసుడు పెద్ద సర్పంగా మారుతాడంట. సర్పంగా మారిన ఆ రాక్షసుడు బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తుంటాడు. దీంతో ఆగ్రహించిన ఈశ్వరుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరించాడంట. ఆ రాక్షసుడు చనిపోతూనే పెద్ద కొండగా మారిపోతాడంట..అలా ఏర్పడిందే ఈ కొండ అని పురాణాల కథనం. అయితే ప్రజలకు ముప్పు పొంచివుండడంతో పరమ శివుడు కూడా ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి. అయితే ఆ రాక్షసుడి దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించారట. పిడుగుపడితే అక్కడున్న జనం, పశుపక్షాదులు నాశనం అయిపోతాయి. అందుకే తనపై పిడుగు పడేలా చేసి దాన్ని శివుడు నివారిస్తారనేది పురాణాల కథనం. మహాదేవుడి ఆజ్ఞ ప్రకారమే 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడుతుందని…ఆ వెంటనే శివలింగం అతుక్కుంటుందని ప్రతీతి. ఇలా 12 ఏళ్లకు ఒకసారి పిడుగు పడి శివలింగం ముక్కలై, తిరిగి అతుక్కోవడం మన దేశంలోనే అత్యంత అద్భుతంగా చెబుతారు. ఇక కులూ వ్యాలీలో ఉన్న ఈ మహాదేవుడి ఆలయాన్ని చేరుకోవడం అంత సులభం కాదు. ఈ ఆలయం కొండపై సముద్ర మట్టానికి 2 వేల 450 మీటర్ల ఎత్తులో కొండపై ఉంది. కాని పర్వతంపైకి వెళ్తున్నకొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది.అదృష్ఠవంతులకు మాత్రమే ఈ కొండపై మహాదేవుడి దర్శనం లభిస్తుందట. కులూలో కొలువై ఉన్న బిజిలీ మహదేవ్‌కు ఏడాదికి ఒకసారి ఉత్సవం నిర్వహిస్తారు. కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం కూడా ఇక్కడి ఆనవాయితీ. శైవ క్షేత్రంగానే కాదు పర్యాటకులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది కులూవ్యాలీ. ఈ పర్వత ప్రాంతం ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో పర్వతారోహకులు, సాహసికులు కూడా పెద్ద ఎత్తున కులూకు తరలివస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పర్యాటకులు అమితానందాన్ని పొందుతారు. టూరిస్టులు ఇక్కడి బిజిలీ మహదేవ్ మందిరాన్ని కూడా సందర్శిస్తుంటారు. చూశారుగా…పిడుగు పడి ముక్కలై తిరిగి అతుక్కునే ఈ అరుదైన శివలింగాన్ని దర్శించాలంటే కులూకు వెళ్లాల్సిందే. బిజిలీ మహాదేవ్ ఆలయాన్ని సందర్శించండి..అద్భుత ఆధ్యాత్మిక, పర్యాటక అనుభవాన్ని పొందండి.