తిరుమల తిరుపతి ఏడుకొండలపై కొలువై…ప్రపంచవ్యాప్తంగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్న కలియుగదైవం…శ్రీ వేంకటేశ్వరస్వామి. ఏడుకొండలవాడు, నారాయణ, శ్రీనివాసుడు, వేంకటేశ్వరుడు, శ్రీ మన్నారాయణ, గోవిందా, ముకుందా…ఇలా ఏ పేరుతో పిలిచినా ఇట్టే పలికి భక్తులను కరుణించే స్వామి… శ్రీ వేంకటేశ్వర స్వామి. ఇక ఏడుకొండవాడిని దర్శించేందుకు వచ్చే భక్తులంతా గోవిందా గోవిందా అంటూ కొండ ఎక్కుతారు. తిరుమలలో స్వామివారిని దర్శించి తిరిగి వచ్చేంత వరకు గోవింద నామాన్ని సర్మిస్తూనే ఉంటారు. ఇలా శ్రీ వేంకటేశ్వరుడిని గోవింద నామంతో పిలవడం వెనుక ఓ కథ ఉంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా భువిపై అవతరించాడు. సప్తగిరులే తాను ఉండవలసిన చోటు అని భావించిన శ్రీవేంకటేశ్వరుడు తిరుమల తిరుపతి ప్రాంతానికి వచ్చాడట. అక్కడ యుగాలుగా ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, తపస్సు చేసుకుంటున్న అగస్త్య మహర్షిని చూసి..ముని పుంగవా నేను వేంకట నాయకుడిని..ఈ కలియుగానికి అధిపతిని…ఈ సప్తగిరి మీద నివిసిద్దామని వచ్చాను. నాకు రోజు క్షీర సేవనం కోసం నాకు ఒక గోవును ఇస్తావా అని అడిగాడంట. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరుడే వచ్చి నన్ను గోవునివ్వమని అడగడంతో పరమానందభరితుడైన అగస్త్య మహర్షి..ఆ సమయానికి ఆశ్రమంలోని గోవులన్నీ మేతకై అడవిలోకి వెళ్లడంతో…స్వామి నీవు నివసించడానికి ఈ సప్తగిరులను ఎంచుకున్నావు కానీ..ఇంకా రాలేదు కదా…మా అమ్మ శ్రీ మహాలక్ష్మీతో కలిసి వచ్చిన నాడే నీకు గోవును ఇస్తాను.. అంటూ వేంకటేశ్వరుడితో అన్నాడు. అగస్త్యమహర్షి కోరికను కాదనలేక..వేంకటేశ్వర స్వామి సరే అంటూ అంతర్థానం అవుతాడు.
కొన్నాళ్ల తర్వాత కలియుగాంత పర్యాంతం..ఏడుకొండలపై స్థిర నివాసం ఏర్పరచుకోవటానికి శ్రీ మహాలక్ష్మీతో కలిసి భువిపైకి వస్తాడు శ్రీ వేంకటేశ్వరుడు. ఆ సమయంలోఆశ్రమంలో అగస్త్య మహర్షి లేరు. అక్కడి శిష్యులెవరో ఉంటే గోవు విషయమై శ్రీ వేంకటేశ్వరస్వామి వచ్చాడని మీ గురువుగారికి చెప్పమని వెనుదిరుగుతాడు. అలా స్వామి వెనుదిరిగాడో లేడో అగస్త్యమహర్షి ఆశ్రమానికి వచ్చాడు. దీంతో శిష్యుడు గోవు విషయం చెప్పి..ఇప్పుడే స్వామి వెళ్లిపోయాడు..అంటూ..అదిగో స్వామి అని శ్రీవేంకటేశ్వరుడు వెళుతున్న మార్గాన్ని చూపిస్తాడు. దీంతో ” దేవ దేవుడు స్వయంగా నా ఆశ్రమానికి వచ్చిన సమయానికి నేను లేకపోయేనే…నాది ఎంత దురదృష్టం ! ” అంటూ ఆగస్త్యమహర్షి నొచ్చుకుంటూ.. పాకలో ఉన్న గోవు నొకదానిని కట్టు విప్పి , స్వామి..,”గోవు+ఇందా !” “గోవు+ఇందా !” అంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ శ్రీ వేంకటేశ్వరుని వెనకాలే వెళతాడు. ‘ఇందా ‘అంటే “ఇదిగో ! తీసుకో ! ” అని అర్ధం కాబట్టి , మునీంద్రుడు ఎలుగెత్తి , ” గోవిందా ! గోవిందా !” అని అరుస్తూ ..శ్రీవేంకటేశ్వరుడి వెంటబడి వెళుతూనే ఉన్నాడు. ఏడుకొండల శిఖరాగ్రానికి చేరే సరికి అగస్త్య మహర్షి 108 సార్లు “గోవిందా ! గోవిందా ! ” అని పిలిచాడంట. అప్పుడు శ్రీవేంకటేశ్వర స్వామి వెనుదిరిగి , “మునీంద్రా…. నన్ను నీవు “గోవిందా ! గోవిందా! “అని నూటెనిమిది సార్లు పిలుచావు కాబట్టి.. కలియుగంలో నా నామాల్లో గోవిందుడు అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంటూ వరం ఇస్తాడు. అలాగే “నాకీ “గోవింద” నామం ఎంతో ప్రీతి పాత్రమయ్యింది కూడా ..నీలాగే ఈ కొండనెక్కే నా భక్తులు, నన్నుద్దేశించి , “గోవిందా ! గోవిందా! “అని నూటెనిమిది సార్లు పలికితే, వాళ్ళకి మోక్షమిస్తాను ” అని వాగ్దానం చేసి, అగస్త్యుడిచ్చిన గోవును ఆప్యాయంగాస్వీకరిస్తాడు. . ఇక అప్పటి నుంచి శ్రీ వేంకటేశ్వరుడి స్వామిని దర్శించునే భక్తులు “ఏడు కొండల వాడా ! వెంకట రమణా ! గోవిందా ! గోవిందా ! ఆపద మ్రొక్కుల వాడా ..గోవిందా..గోవిందా.. అంటూ స్వామిని సర్మించుకుంటే ఏడుకొండలు ఎక్కుతారు. అలా కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాల్లో ఈ గోవిందనామం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. చూశారుగా…శ్రీవేంకటేశ్వరుడిని గోవిందా అని పిలవడం వెనుక ఉన్న పురాణ గాథ ఏంటో..మనం కూడా గోవిందా గోవిందా అంటూ మనసారా సర్మిద్దాం..స్వామివారి కృపకు పాత్రులమవుదాం.