తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతాంగం గురించి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తోన్న సంగతి తెల్సిందే. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా రైతన్నలకు రుణాలు మాఫీ చేయడమే కాకుండా పంటపెట్టుబడి కింద రైతుబంధు పేరిట రూ పదివేలను రెండు పంటలకు కల్పి ఎకరాకు ఆర్థిక సాయం ఇస్తున్నారు.
వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగంటల కరెంటిచ్చిన రాష్ట్రంగా తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు. రైతుబీమా ,ఎరువులు,ట్రాక్టర్లు పంపిణీ ఇలా పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తున్నారు. వీటితో పాటుగా మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం తీసుకొచ్చారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగం జీవితాల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి కేసీఆర్..
అయితే ప్రస్తుత సీజన్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కడంతో నారాయణపుర నుంచి 1.13లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఔట్ ఫ్లోగా విడుదలవుతున్నాయి. దీంతో ఈ రోజు జూరాల ప్రాజెక్టులో వరదప్రవాహాం భారీగా పెరగనున్నది. ఒక పక్క కృష్ణమ్మ పరవళ్లు మరో పక్క గోదావరి జలాలతో తెలంగాణలో ఉన్న పలు ప్రాజెక్టులు నిండటంతో రైతన్నలు ఎన్నడూ లేని విధంగా కోటి ఎకరాల్లో సాగు చేస్తోన్నారు.