74 ఏళ్ల వయసులో కవలపిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన అతి పెద్ద మహిళగా మంగాయమ్మ రికార్డు నెలకొల్పారు. ఆమెకు గుంటూరు అహల్యా ఆస్పతిలో ఉమాశంకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గురువారం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం ఉమాశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. సంతానం కోసం మంగాయమ్మ దంపతులు గతేడాది నవంబర్ 12న తమ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. మంగాయమ్మ ఆరోగ్యంగా ఉండటంతో ఐవీఎఫ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించినట్టు వెల్లడించారు. అయితే గర్భం దాల్చిన తరువాత మంగాయమ్మకు ఆహారం విషయంలో కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆమెకు ప్రత్యేక వైద్యం అందించినట్టు వివరించారు. 10 మంది వైద్యులు మూడు బృందాలుగా విడిపోయి.. రాత్రింబవళ్లు కష్టపడి విజయం సాధించినట్టు పేర్కొన్నారు. ఒక పద్దతి ప్రకారం చికిత్స చేయడం వల్లే వైద్య రంగంలో అద్భుతమైన విజయం సాధించామన్నారు. నేడు గురుపూజోత్సవం కావడంతో ఈ విజయాన్ని తన గురువులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు
