ఎట్టకేలకు టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. 25 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలికి ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదం తెలపడమే ఆలస్యం వెంటనే నూతన పాలక మండలి సభ్యుల వివరాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇప్పటివరకు ఛైర్మన్ సహా 15 మంది సభ్యులు ఉండగా, ఇకపై 25 మంది వరకు పాలకమండలి సభ్యులను నియమించవచ్చు. వీరితో పాటు నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఉంటారు. దీనికి సంబంధించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించింది. దీంతో మొత్తం 29 మంది సభ్యులతో టీటీడీ జంబో పాలకమండలి కొలువు దీరనుంది. వీరితో పాటు ప్రత్యేక ఆహ్వానితులను కూడా నియమించుకునే సౌలభ్యం టీటీడీకి ఉంటుంది. అయితే వీరికి ఓటుహక్కు ఉండదు. ఈ ఆర్డినెన్స్‌కు ఈరోజు గవర్నర్ ఆమోదం తెలపనున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకం ఓ కొలిక్కి రావడంతో ఎవరెవరికి చోటు దక్కుతుందనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీటీడీ బోర్డు సభ్యులు వీరే అంటూ మీడియాలో పలువురు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీఎం జగన్ ఎవరికి అవకాశం కల్పించాడో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే..!
