గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు..కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం..అక్కడ కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం…ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల..గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. అందుకే శాస్త్రంలో ఏడవ నెల లోపు ఎత్తైన మెట్లు ఉన్న దేవాలయాలు, కొండపై ఉన్న ఆలయాలకు వెళ్లకూడదు. నదులు దాటకూడదు..కొండలు ఎక్కకూడదు అనే నియమాలు గర్భిణీ స్త్రీలకు చెప్పబడ్డాయి. ఇక ఏడవ నెల ప్రసవ మాసంగా చెప్పబడుతుంది. కాబట్టి ఏడవ నెల నుంచి గర్భిణీ స్త్రీతో పాటు, ఆమె భర్త కూడా దేవాలయాలకు వెళ్లకూడదు అని శాస్త్రం చెబుతోంది. ఏడవ నెల నుంచి గర్భిణీ స్త్రీలకు జాతాశౌచం అంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి వచ్చే మైలను జాతాశౌచం అంటారు. ఆ విధంగా వారి ఇంట్లో జరిగే ఏ శుభకార్యానికి, దేవాలయ దర్శనానికి భార్యా భర్తలు అర్హత కోల్పోతారు. ముఖ్యంగా మూల నక్షత్రం, అనూరాధ నక్షత్రం, అశ్విని నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, కలిగిన మహిళలు గర్భం ధరించిన తర్వాత 5 వ నెల నుండే ఆలయాలకు వెళ్లకూడదు అని శాస్త్రం చెబుతోంది. అయితే గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసమే శాస్త్రంలో ఇలా దేవాలయాలకు వెళ్లకూడదు అని చెప్పబడిందని పండితులు అంటున్నారు. ఇక గర్భిణీ స్త్రీలు కొబ్బరికాయ కూడా కొట్టకూడదని శాస్త్రం చెబుతోంది. ఎందుకనగా మహిళ గర్భవతిగా వున్నపుడు 3 వ నెల వచ్చిన పిదప గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది. అలాగే కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము. అదికూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానంగా శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి కొబ్బరికాయను పగలగొట్టడం, విచ్చేదన చేయడము మంచిది కాదు…చూశారుగా..గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు…కొబ్బరి కాయ కొట్టకూడదు అనడం వెనుక ఉన్న అర్థం ఇదే.
