పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన వైసీపీ నేత సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా విచారణ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైనా కేసు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో మార్చి 14న వివేకానందరెడ్డిని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు అప్పటి టీడీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ సరిగా చేయడం లేదని చంద్రబాబు హయాంలో వేసిన సిట్ కాకుండా జగన్ సీఎం అయ్యాక మరో సిట్ ఏర్పాటు చేసారు. ఈ కేసులో అనుమానితులైన గంగిరెడ్డి, రంగయ్య, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డిలను పోలీసులు విచారిస్తున్నారు.
ఈ కేసులో పులివెందుల కోర్టు అనుమతితో వారికి నార్కో అనాలిసిస్ టెస్టులు కూడా చేశారు. త్వరలో ఈకేసు ఛేదిస్తారని భావిస్తున్న తరుణంలో ప్రధాన నిందితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్తబ్దుగా ఉన్న కేసు మరోసారి మీడియా దృష్టిని ఆకర్షించింది. ఏ1 నిందుతుడు సూసైడ్ చేసుకోవడం, అందుకు పోలీస్ అధికారి వేధింపులే కారణమని సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. ఇప్పుడు ప్రధాన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడడంతో మరో కొత్తవివాదం మొదలైంది. వివేకా హత్య కేసులో ప్రధానమైన వ్యక్తులను ఇలా బెదిరిస్తున్నారంటే బలమైన శక్తులు వీరి వెనుకున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా మరణవార్త తెలిసినప్పటినుండీ పోస్టుమార్టానికి వెళ్లేటప్పుడే ఆయన గుండెపోటుతో మరణించారని వార్తలు వచ్చినా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చి వివేకాది హత్య అంటూ ఆరోపించారు. అది హత్య అని నిర్ధారితమైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ ఇది చంద్రబాబు లోకేశ్ లు ఆదినారాయణ రెడ్డి ద్వారా హత్య చేయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సాధారణంగా శాంతి భద్రతల సమస్య ఉండే ఎన్నికల సమయంలో పోలీసులు ఇలాంటి హై ప్రొఫైల్ మర్డర్ విషయంలో ఆషామాషీ విచారణ జరిపి ఒక కొలిక్కి రాలేరు కాబట్టి ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చారు కాబట్టి కేసు విచారణ వేగవంతం అయ్యింది. ఇప్పుడు జగన్ పై ఓ బృహత్తర బాధ్యత ఉంది.
హత్యగావింపబడ్డ వ్యక్తి స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చిన్నాన్న కాబట్టి ఈ కేసు తప్పుదోవ పట్టకుండా చర్యలు తీసుకుంటేనే ప్రజలకు ప్రభుత్వంపైనా, జగన్ పైనా నమ్మకం పెరుగుతుంది. తాజాగా ప్రధాన నిందితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కడప ఎస్పీ కార్యాలయానికి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ చేరుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య వెనుక వాస్తవాలు తెలుసుకొనేందుకు స్వయంగా రంగంలోకి దిగిన డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు రేంజ్ డిఐజీ వెంకటరామిరెడ్డి, ఎస్పీ అభిషేక్ మహంతి, ఇతర సిట్ అధికారులు ఉన్నారు. అయితే గతంలోనే కొత్త ప్రభుత్వం 23మందితో ప్రత్యేక బృందాన్ని దర్యాప్తుకోసం నియమించగా అప్పట్లోనే వాళ్లు ఆదినారాయణరెడ్డిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. పలువురు కీలక నేతల ఫోన్ కాల్ డేటా సేకరించి హత్య ముందు ఎవరెవరితో మాట్లాడారు అన్నదానిపై డేటా ఆధారంగా దర్యాప్తు చేసారు. ఇలా ఫోన్ అందుకున్నవారిలో ఆదినారాయణరెడ్డితో పాటు పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆదినారాయణరెడ్డి, సతీష్ రెడ్డిల ఫోన్ కాల్ డేటాను ఇప్పటికే పోలీసులు సేకరించారు.. అయితే ఇదే ఘటన ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. కారణం ఏమిటంటే ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసులు రెడ్డి నార్కో ఎనాలసిస్ టెస్ట్ లో ఆదినారాయణ పేరు చెప్పాడంటూ పులివెందుల ప్రజలు చర్చించుకుంటున్నారు.