టాలీవుడ్ ఫిలిం చాంబర్ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని, పార్టీకోసం కష్టపడిన తనను ఆదుకోవడానికి బదులు తనపై తప్పుడు కేసులుపెట్టి వేధిస్తున్నారన్నారు. తన సేవలను వాడుకుని, ఆపై అన్యాయం చేశారని సునీత పవన్ పైనే ఆరోపణలు చేసింది.
జనసేన పార్టీ కోసం తాను అహర్నిశలూ శ్రమించానని, తనను ఆదుకుంటానని చెప్పి వాడుకుని, ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్ సభ పరిధిలో, పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన భీమవరం, గాజువాకల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తానే కాకుండా తనకు పరిచయం ఉన్నవారితో ఆమె జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పటివరకూ సినిమాల పరంగానే క్యాస్టింగ్ కౌచ్ చూసామని రాజకీయాల్లోనూ క్యాస్టింగ్ కౌచ్ జనసేన పార్టీ తెచ్చిందంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.