జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలో తెలంగాణ సర్కారు అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతోపాటు కన్నెపల్లి పంపు హౌస్ ను సందర్శించడానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సందర్శించారు. తన వెంట సుమారు ఎనిమిది వేల మంది టీఆర్‌ఎస్ శ్రేణులతో కలసి ప్రాజెక్టులను సందర్శించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో నిర్మితమైన ఇంజినీరింగ్ మహా అద్భుతం… తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కావాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తుంటే పనిలేని వాళ్లు ఉనికి కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.టీఆర్‌ఎస్ పార్టీని ఢీకొనే సత్తా మరో పార్టీకి లేదన్నారు. బీజేపీకి తెలంగాణపై చిత్తశుద్ది ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా గురించి మాట్లాడని బీజేపీ నేతలు.. తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే వినడానికి సిద్ధంగా లేరని చురకలు అంటించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి అనుమతులు ఇప్పించి అప్పుడు మాట్లాడాలన్నారు. ఏదో నాలుగు సీట్లు రాగానే బీజేపీ ఎగిరి పడడం కరెక్ట్ కాదని కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు.