నాకొక తిక్క ఉంది..దానికో లెక్క ఉంది..ఇది గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాపులర్ డైలాగ్. కానీ రాజకీయాల్లో జనసేనానికి తిక్క ఉంది..కాని దాని లెక్క చంద్రబాబు దగ్గర ఉంది. గత ఐదేళ్లుగా పవన్ రాజకీయాలను గమనిస్తే..పవన్ తిక్కకు లెక్క చంద్రబాబు దగ్గరే ఉందనడంలో సందేహమే లేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కల్యాణ్ చంద్రబాబు మౌత్‌పీస్‌లా ఉంటున్నాడే తప్ప…ఏనాడు సొంతంగా ప్రజల కోసం పోరాడింది లేదు. చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ ఫాం హౌస్ నుంచి బయటకు రావడం…ఆ సమస్యను పక్కదారి పట్టించి..బాబును సేవ్ చేయడం..మళ్లీ ఫాం హౌస్‌కు వెళ్లిపోవడం…ఇప్పటికీ ఇదే తంతు నడుస్తోంది. సినిమా పరిభాషలో చెప్పాలంటే..బాహుబలి మూవీలో మహిష్మతి సామ్రాజ్యానికి, రాణి శివగామికి కట్టుబాసినగా కట్టప్ప ఉంటాడు. సేమ్ టు సేమ్ పవన్ కూడా చంద్రబాబుకు కట్టుబానిసలాగా పని చేస్తున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకసారి పవన్ రాజకీయ ప్రస్థానం తరచి చూస్తే అడుగడుగునా చంద్రబాబును భుజాన మోసిన విధానం కనిపిస్తోంది.
సరిగ్గా 2014 ఎన్నికలకు ముందు టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. అప్పటికీ పవన్‌కు రాజకీయాలేం కొత్త కాదు. 2009 సార్వత్రిక ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో యువరాజ్యం విభాగం అధ్యక్షుడిగా పవన్ ప్రచారం చేశాడు. కాంగ్రెస్ నాయకులను పంచెలూడదీసి కొట్టండి అంటూ రంకెలు వేశాడు. అయితే ఎన్నికల తర్వాత వైయస్ఆర్ మళ్లీ అధికారంలోకి రావడం..కింగ్ మేకర్ అవుతాడనుకున్న చిరు… చివరకు పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి రాజకీయాల్లో జీరో అయ్యాడు. తన అన్న పార్టీని ఇలా కాంగ్రెసలో కలపడం నచ్చని పవన్ రాజకీయాలకు విరామం ఇచ్చి మళ్లీ సినిమాలు చేసుకుంటూ పోయాడు.
అయితే 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మళ్లీ ప్రత్యక్షమైన పవన్ ప్రశ్నిస్తానంటూ జనసేన పార్టీ పెట్టాడు. ఇక్కడే చిన్న అనుమానం ఉంది.సరిగ్గా పార్టీ అనౌన్స్ చేసే కొద్ది రోజులకు ముందు పవన్, చంద్రబాబు రాజగురువు అని పిలువబడే ఓ పత్రికాధిపతితో ఫిలింసిటీలో సమావేశమయ్యాడని వార్తలు వచ్చాయి. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ కొద్ది రోజులకే పవన్ పార్టీ పెడుతున్నట్లు అనౌన్స్ చేశాడు. అప్పటికి రాష్ట్రం రెండుగా విడిపోయింది. చంద్రబాబు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాడు. అయితే రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబును ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. అయినా జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు మరో ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉంటాననే భయంతో రాజగురువు సాయంతో పవన్ కల్యాణ్‌చే పార్టీ పెట్టించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినీ స్టార్‌గా పవన్‌కు ఉన్న పాపులారీటీని కాదనలేం. తన అన్నను తమ పార్టీలోకి లాక్కుందనే కోపమో ఏమో కానీ పవన్‌కు ఎందుకో కాంగ్రెస్ పార్టీ అంటే కోపం. తొలి ప్రసంగంలోనే కాంగ్రెస్ హఠావో అంటూ..పవన్ చేసిన ఆవేశపూరిత ప్రసంగాలు ప్రజలను ముఖ్యంగా యువతను ఆకట్టుకున్నాయి. నిజానికి పవన్ జనసేన పార్టీ అనౌన్స్ చేసినప్పుడు రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తి అవతరిస్తుందని తటస్థవాదులంతా ఆశించారు. కాని పవన్ తొలి ప్రసంగంలోనే తాను చంద్రబాబు బంటును అని చెప్పకనే చెప్పి వారి ఆశలను నీరుగార్చారు. ప్రసంగం ఆరంభం నుంచి కాంగ్రెస్‌ను, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించిన పవన్ కల్యాణ్…చంద్రబాబు ప్రస్తావన ఏ మాత్రం తీసుకురాలేదు. చివర్లో చంద్రబాబు గురించి ప్రస్తావన వచ్చినా…ముసిముసినవ్వులు నవ్వుతూ..ఆయన మంచి వ్యక్తి…ఆయన గురించి తర్వాత మాట్లాడుదాం…అంటూ వడివడిగా వెళ్లిపోవడం రాజకీయ పార్టీలను, ప్రజలను నివ్వెరపర్చింది.
ఇక 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో పోటీకి సమయం లేదంటూ పవన్ కల్యాణ్ చంద్రబాబు, మోదీతో కలిసి టీడీపీని భుజాన మోసాడు. లక్ష కోట్లు, అవినీతిపరులు అంటూ విమర్శలు చేసి, అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబుకు పట్టం కట్టండి..నాది బాధ్యత అంటూ ఊరూరా చెప్పులరిగేలా తిరిగి…ప్రచారం చేశాడు. దీంతో అప్పుడు రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో జగన్‌ని కాదని…అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబుకు ప్రజలు పట్టం గట్టారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ బాటలో నడిచి…గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీకి మద్దతు ఇచ్చింది. అసలు కాపులు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు మద్దతు పలికేవారు. వైయస్ హయాంలో కాపులు పూర్తిగా కాంగ్రెస్‌కే జై కొట్టేవారు. కానీ వైయస్ మరణాంతరం కాపు యువతలో పవన్ ఫ్యాక్టర్ మొదలైంది. దీంతో కాపులు 2014 ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీకి మద్దతు పలికారు. దీనికి ఫలితమే తూగో, పగో జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వైసీపీని బాగా దెబ్బకొట్టింది ఈ రెండు జిల్లాలే.
మొత్తంగా..పవన్ ఫ్యాక్టర్..జగన్ స్వీయ తప్పిదాలతో నవ్యాంధ‌్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు…ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ మళ్లీ ఫాం హౌస్‌కు వెళ్లిపోయాడు..అడపదడపా మళ్లీ సిన్మాలు చేసుకుంటూ సైలెంట్ అయిపోయాడు. అయితే రాజధాని పేరుతో అమరావతిలో బాబు, ఆయన సామాజివర్గీయులు వందలాది ఎకరాలు బినామీల పేరుతో కొల్లగొట్టి వేల కోట్లు కొల్లగొడుతున్నా పవన్ ఏనాడు ప్రశ్నించింది లేదు. ప్రత్యేక హోదాపై బాబు మాట మార్చి ప్యాకేజీకి జై కొట్టినా పవన్ బాబును పల్లెత్తి మాట అన్నది లేదు.. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలు అంటూ కాకినాడలో వెక్కిరించిన పవన్…బాబును ఇంటికి వెళ్లి కలిసిన తర్వాత ప్యాకేజీపై ప్యాకప్ అయిపోయాడు. హోదాపై విశాఖలో యువత ధర్నాకు పిలుపునిచ్చిన పవన్ తాను స్వయంగా హాజరు కాకుండా హ్యాండ్ ఇచ్చాడు. ఇక ఎన్నికలకు ముందు మోదీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన పవన్ కల్యాణ్..ఎన్నికల తర్వాత బాబులాగానే యూటర్న్ తీసుకున్నాడు. హోదా గురించి మోదీని అడగడానికి నాకు స్థాయిలేదంటూ తప్పుకున్నాడు.
ఒక పక్క చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ ప్రత్యక్షమై ఆ సమస్యను పక్కదారి పట్టించి మళ్లీ ఫాంహౌస్‌కు వెళ్లిపోయాడు. మరో పక్క ప్రతిపక్షనాయకుడిగా జగన్ ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతుంటే…పవన్ మాత్రం చంద్రబాబుకు కొమ్ము కాసేవాడు. అమరావతిలో బాబు సర్కార్ ల్యాండ్‌పూలింగ్ పేరుతో చేస్తున్న భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉండవల్లి, బేతంపూడి వంటి గ్రామాల రైతుల పక్షాన ప్రతిపక్ష నాయకుడు జగన్ అండగా నిలిచారు. ఆ సమయంలో బాబు సర్కార్ తీవ్ర ఇబ్బందిలో పడింది. వెంటనే రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ అమరావతి గ్రామాల్లో పర్యటించి రైతన్నలు పెట్టిన పెరుగన్నం పెట్టి…నమ్మి భూములివ్వండి..మీకు ఏదైనా సమస్య వస్తే బాబు సర్కార్‌తో నేను మాట్లాడుతానంటూ వారిని వంచించి వెళ్లిపోయాడు. ఇక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష నేత జగన్ చేసిన పోరాటాలకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అధికారంలోకి రాగానే 1100 కోట్లు చెల్లించి అగ్రి గోల్డ్ బాధితుల సమస్యలు తీరుస్తానని జగన్ ప్రకటించాడు. దీంతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది..దీంతో మళ్లీ పవన్ ఈ ఇష్యూలోకి ఎంటరై..అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు విన్నట్లు..సమస్యను ఎటూ తేల్చకుండా…పక్కదారి పట్టించాడు. ఇలా బాబుకు ఇబ్బంది కలిగినప్పుడల్లా ఇలా పవన్ ఫాంహౌస్ నుండి బయటకు రావడం..ఇష్యూను సైడ్ ట్రాక్ చేయడం..మళ్లీ ఫాంహౌస్‌లోకి వెళ్లడం..ఇది 2014 నుంచి 2018 వరకు పవన్ సాగించిన రాజకీయం.
ఇక రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రజాధనాన్ని దోచుకోడవమే పరమావధిగా భావించారు. రాజధాని పేరుతో, పోలవరం పేరుతో, జన్మభూమి కమిటీల పేరుతో, టీడీపీ పెద్దల దగ్గర నుండి..గ్రామస్థాయి టీడీపీ కార్యకర్తల వరకు అవినీతికి పాల్పడుతూ, వేల కొట్లు కొల్లగొడుతున్నా పవన్ ఏ నాడూ ప్రశ్నించింది లేదు. పైగా ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై, వైసీపీ నేతలపై తాట తీస్తా..తోలు వలుస్తా అంటూ ఎదురుదాడి చేసేవాడు. అయితే ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన 600 హామీలలో ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చని తీరుపై, రాజధాని, పోలవరంలో వేల కోట్ల జరిగిన అవినీతిపై, హోదాపై మాట మార్చి ప్యాకేజీకి జై కొట్టడంపై, నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ఇసుక మాఫియాతో పాటు, పలు అవినీతి, అక్రమాలకు పాల్పడడంపై, గ్రామస్థాయిలో జన్మభూమికమిటీల అవినీతిపై ఏపీ ప్రజల్లో బాబు సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రజా సంకల్పయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. ఏడాదికి పైగా సాగిన సుదీర్ఘ పాదయాత్రలో జగన్ అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..బాబు సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ అధికారంలోకి రాగానే ఆయా సమస్యలను పరిష్కరిస్తానంటూ సాగిపోయారు. దీంతో జగన్ పట్ల ప్రజల్లో పూర్తిగా సానుకూలత ఏర్పడింది. రోజు రోజుకీ జగన్‌కు పెరుగుతున్నఆదరణతో చంద్రబాబులో ఆందోళన మొదలైంది. దీంతో బాబు డైరెక్షన్‌లో మళ్లీ పవన్ డ్రామా మొదలైంది. అజ్ఞాతవాసి మూవీ అట్టర్‌ఫ్లాప్ తర్వాత పవన్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2018 పార్టీ ఆవిర్భావ సభలో నారాలోకేష్ అవినీతి మీకు తెలుసా…టీడీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ ఊగిపోయారు. టీడీపీ నేతల అవినీతిపై పవన్ మాటల దాడి మొదలుపెట్టారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తి తామేనని, 2019లో అధికారంలోకి వస్తామని పవన్ బీరాలు పలికారు. అయితే స్క్రిప్ట్‌లో భాగంగా టీడీపీ నేతలు కూడా పవన్ వల్ల మేం గెలవలేదు అంటూ వెక్కిరించడం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీల మధ్యే పోటీ అని ఎల్లోమీడియా ప్రచారం మొదలుపెట్టింది. పవన్‌తో మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుతామని నమ్మిన కమ్యూనిస్టులు కూడా జనసేన పార్టీ పంచన చేరారు
. కానీ టీడీపీ నేతలు, పవన్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం అసలుకే ఎసరు వస్తుందని భావించిన చంద్రబాబు పవన్‌ను అలెర్ట్ చేశాడు. ఆ తర్వాత జనసేనాని తన విమర్శలను అధికార టీడీపీ నుంచి వైసీపీ వైపు మళ్లించాడు. ప్రతిపక్ష నాయకుడు జగన్, వైసీపీ నేతలు దొంగలు, వారిని తరిమికొట్టండి అంటూ పవన్ తనదైన స్టైల్లో ఊగిపోయేవారు. పవన్ రాజకీయంగా మరోసారి తప్పటడుగులు వేసింది ఇక్కడే. ఎప్పుడైతే పవన్ రాజకీయంగా తన విమర్శలను టీడీపీ నుంచి వైసీపీ వైపు మళ్లించాడో…బాబు, పవన్ ఒకటే అన్న సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. పైగా పవన్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టకపోవడం, చంద్రబాబు, లోకేష్, టీడీపీ మంత్రులు పోటీ చేసిన స్థానాల్లో కమ్యూనిస్ట్ అభ‌్యర్థులను, బలహీనమైన అభ్యర్థులను బరిలోకి దింపడం, తాను స్వయంగా రాష్ట్రమంతటా తిరిగి జగన్, వైసీపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేసి, లోకేష్, ఇతర టీడీపీ మంత్రుల నియోజకవర్గాల్లో ప్రచారం చేయకపోవడంతో… జనసేనాని తెలుగుదేశానికి లోపాయికారిగా పనిచేస్తున్నాడని ప్రజలకు అర్థమైంది. పవన్, చంద్రబాబుకు తొత్తుగా పని చేస్తున్నాడని గ్రహించిన ప్రజలు జనసేనను టీడీపీ బీ టీమ్‌గా భావించారు. జగన్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని విశ్వసించిన ప్రజలు చంద్రబాబు, పవన్‌ల డ్రామాను తిరస్కరించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబుకు సరిగ్గా 23 సీట్లే కట్టబెట్టారు. స్వయంగా జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్‌ను గాజువాక, భీమవరంలో కూడా ఓడించారు. జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే కూడా వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచాడు. వైసీపీకి ఏకంగా 151 సీట్లు కట్టబెట్టి అపూర్వ విజయం అందించారు.
ఇక వైసీసీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పలు సంక్షేమ పథకాలతో, ప్రజోపయోగ కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నారు. అయితే ప్రభుత్వానికి 50 రోజుల సమయం ఇవ్వకుండానే టీడీపీ రాజకీయంగా దిగజారుడు విమర్శలు చేస్తోంది. తొలుత టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారంటూ బాబు చేసిన ప్రచారం బూమరాంగ్ అయింది. పైగా జగన్ సర్కార్ రాజధాని, పోలవరంతో సహా టీడీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించేందుకు సిద్ధం అవడంతో బాబు బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. వరదల నేపథ్యంలో వైయస్ సర్కార్‌ను బద్నాం చేయడానికి ప్రయత్నించి.. లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా అడ్డంగా దొరికిపోయింది. ఈ దశలో అమరావతికి వరద ముంపు నేపథ్యంలో రాజధానికి వరద ముంపు ఉందని, అమరావతి రాజధానిగా సరికాదని, ఎక్కువ ఖర్చు అవుతుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ టీడీపీ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటూ వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లుతోంది. స్వయంగా చంద్రబాబు, లోకేష్‌లు, టీడీపీ మాజీ మంత్రులు సెంటిమెంట్ పేరుతో రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు, అయినా ప్రయోజనం లేకపోవడంతో బాబుకు రాజకీయంగా మైలేజీ రావడం లేదు. దీంతో మళ్లీ పవన్ రంగంలోకి దిగాడు. అమరావతిలో పర్యటిస్తున్నాడు. పనిలో పనిగా రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే వూరుకునేది లేదు..అంటూ తనదైన స్టైల్లో ఊగిపోతూ రైతులను రెచ్చగొట్టే పనిలో పడ్డాడు. దీంతో ప్రజలు పవన్ తీరుపట్ల పెదవి విరుస్తున్నారు.
పవన్ రాజకీయంగా ఘోర ఓటమిని ఎదుర్కున్న తర్వాత అయినా మళ్లీ ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడుతాడు అని జనసేన పార్టీ అభిమానులు అనుకున్నారు. అయితే మళ్లీ పవన్ ప్రజల తరపున కాకుండా..ఇలా బాబు తరపున పోరాడడం ప్రజల్లో ఏహ్యభావాన్ని కలిగిస్తోంది. పవన్ తిక్కకు లెక్క చంద్రబాబు దగ్గరే ఉందనేదానికి అమరావతి పర్యటనే ఉదాహరణ. రాజకీయంగా అందరూ తప్పులు చేస్తారు..కానీ…ఆ తప్పులను సరిదిద్దుకుని, మళ్లీ పోరాడేవాడే రాజకీయాల్లో విజయవంతం అవుతారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకున్నాడు కాబట్టే..జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ పవన్ చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప…హత్యలు ఉండవు అంటారు. దీనికి ఉదాహరణగా పవన్ కల్యాణ్‌ను చూపించవచ్చు. ఘోర పరాజయం తర్వాత పవన్ మారుతాడు అని అందరూ భావించారు. కానీ పవన్ మాత్రం ఇంకా చంద్రబాబు నీడలోనే ఉంటూ రాజకీయాలు చేస్తున్నాడు. పవన్‌కు ఇప్పుడు చంద్రగ్రహణం పట్టింది. దీంతో జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరి పవన్‌కు చంద్రగ్రహణం ఎప్పుడు వీడుతుందో..జనసేన పార్టీ మళ్లీ గాడిన పడుతుందో అన్నది కాలమే చెప్పాలి. కానీ పవన్ వ్యవహారశైలి చూస్తే చంద్రగ్రహణం ఎప్పటికీ వదిలేలా లేదు.