ఏ విషయాన్నయినా ఇట్టే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు స్పష్టంగా వివరించే సామర్థ్యం గల ముఖ్యమంత్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి. తనకు ఇష్టమైన, ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించే నీటి ప్రాజెక్టులపై శాసనసభలో ప్రసంగిస్తూ(21 జూలై 2004) రైతులు నిజంగా అప్పుల వల్లనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? లేక ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం చేసుకుంటున్నారా? అని రైతులు కానివాళ్లంతా వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో తాను చదివిన ఒక పిట్టకథ చెప్పారు.
బాగా చదువుకున్న పండితుడు ఒకాయన ఒకరోజు ఒక నూనె గానుగ దగ్గరికి వెళ్లాడు. నువ్వులు ఆడించే గానుగ అది. అప్పుడే కూర తిరగమోత పెట్టినట్టు కమ్మటి వాసన వస్తోంది. ఒక ఎద్దు తప్ప ఎవరూ కనిపించలేదు. దాని మెడలోని గంట శబ్దం తప్ప ఇంకే అలికిడీ లేదు. వచ్చిన పెద్దాయన చుట్టూ చూసి ‘‘రామయ్యా’’ అని గట్టిగా పిలిచాడు. గానుగ యజమాని గుడిసెలో నుంచి పరుగెత్తుకుంటూ వచ్చాడు. నూనె కొన్న తర్వాత పండితుడు అతణ్ణి అడిగాడు– ‘‘ఎప్పుడొచ్చినా ఉండవు. అయినా పని నడుస్తూవుంటుంది. ఎలా?’’ అని.
‘‘ఎద్దు మెడలో గంట కట్టింది అందుకే గదయ్యా! గంట శబ్దం వినపడుతున్నంత సేపూ ఎద్దు తిరుగుతున్నట్లే. అది ఆగినప్పుడు నిద్రలో వున్నా తెలుస్తుంది. లేచి పరిగెత్తుకొచ్చి కాస్త పచ్చిగడ్డివేసి, నీళ్లు పెట్టి, మెడ నిమిరి మళ్లీ నడవడం మొదలుపెట్టాక నేవెళ్లి నా పని చూసుకుంటా’’ అన్నాడు రామయ్య.
పండితుడికి అనుమానం తీరలేదు. ‘‘ఎద్దు ఒకేచోట నిలబడి తలమాత్రం ఆడిస్తుంటే నీకు గంట శబ్దం వినబడుతుంది గాని పని సాగదు కదా, అప్పుడెలా?’’ అన్నాడు. దానికి ‘‘నా ఎద్దు అలా చెయ్యదు’’ అని రామయ్య నమ్మకంగా చెప్పాడు. ఎలా చెప్పగలవని పండితుడు సమాధానం కోసం మళ్లీ గుచ్చిగుచ్చి అడిగాడు.
‘‘అది మీలాగా చదువుకున్నది కాదయ్యా. దానికా ఆలోచనే రాదు’’ అని చెప్పి పండితుడి కళ్లు తెరిపించాడు.
-టి.ఉడయవర్లు (‘అక్షరాంజలి’ లోంచి)