తెలంగాణలో మాతా గర్భిణిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం.. పురిటి నొప్పులు వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌకర్యం.. సర్కారు దవాఖానల్లో కోతల్లేని ప్రసవం.. తల్లీబిడ్డల క్షేమంకోసం కేసీఆర్ కిట్లు.. ఆడపిల్లపుడితే అదనపుప్రయోజనం.. దవాఖాన నుంచి సురక్షితంగా ఇంటికి పయ నం.. కడుపులో ప్రాణం పోసుకుంటున్న దగ్గరనుంచి బయటిప్రపంచంలో శిశువు కండ్లు తెరిచేవరకు తల్లీబిడ్డల క్షేమంకోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా భేష్ అనిపిస్తున్నాయి. ప్రభు త్వం చేపడుతున్న చర్యలతో స్వరాష్ట్రంలో గర్భస్థశిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. ఇందుకు నీతిఆయోగ్ వెల్లడించిన తాజానివేదిక నిదర్శనంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో శిశుమరణాలు గణనీయంగా తగ్గాయంటూ నీతిఆయోగ్ తన నివేదికలో ప్రశంసించడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. మొత్తం 25 అంశాల ప్రాతిపదికన దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ చేపట్టిన సర్వేలో శిశు మరణాలను గణనీయంగా తగ్గించడంలో తెలంగాణ ముం దువరుసలో నిలిచిందని తేలింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో శిశుమరణాల రేటు ఎనిమిది శాతం ఉండగా.. 2016లో 5.3 శాతానికి పడిపోయింది.
స్వరాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే..
2013 వరకు రాష్ట్రంలో మాతాశిశు మరణాలు 24 శాతంగా ఉండేవి. ఏజెన్సీ ప్రాంతా ల్లో ఈ పరిస్థితులు మరీ దారుణం. తెలంగాణ ఉద్యమనాయకుడిగా సీఎం కేసీఆర్.. వరంగల్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో తిరుగుతున్న సమయంలో మాతా శిశు మరణాలను చూసి చలించిపోయారు. స్వరాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉండరాదనే లక్ష్యంతో పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఇందులోభాగంగా ఆరోగ్యలక్ష్మికి శ్రీకారం చుట్టారు. గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ కోడిగుడ్డుతో మధ్యాహ్న భోజనం, ఉదయం, సాయం త్రం పాలు, పప్పులు, ఆకుకూరలు, ప్రొటీన్లతో కూడిన ఆహారం అందించారు. 3 నెలల గర్భిణుల నుంచి ప్రసవించే తల్లుల వరకు ఆరోగ్యలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తున్నా రు. అంతేకాకుండా గర్భిణులతోపాటు, బాలింతలకూ ఐరన్ మాత్రలు అందజేస్తున్నా రు. గర్భిణులకు బలమైన ఆహారం అందించడంతో శిశువులు ఆరోగ్యంతో జన్మిస్తున్నారు. ఫలితంగా గర్భస్థ మరణాలు తగ్గిపోయాయి.
కాన్పుచేసి.. కిట్‌ఇచ్చి.. ఇంటికాడ దింపి
ఏజెన్సీ ఏరియాల్లో 24గంటలపాటు దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చిన కేసీఆర్.. పీహెచ్‌సీల్లోనూ సౌకర్యాలు పెంచారు. కేసీఆర్ కిట్‌తో గ్రామీణప్రాంతాల్లోని పేద కుటుంబాల్లో పురిటి సంబురాలు చేసుకునేలా చేశారు. గర్భిణీకి పురిటి నొప్పులు ప్రారంభమైన దగ్గర నుంచి తిరిగిఇంటికి చేర్చేవరకు పూర్తిబాధ్యత తీసుకున్నారు. గర్భిణీని అమ్మఒడి వాహనంలో దవాఖానకు తీసుకుపోవడం, సురక్షితంగా ప్రసవం చేయించడం.. తిరిగి అదే వాహనంలో ఇంటిదగ్గర దింపడం చేస్తున్నారు. తొలిసూరు కాన్పు అంటే తల్లిదండ్రుల్లో వణుకుపుట్టేది. కానీ ఈ భారాన్ని ఇప్పుడు సర్కారే భరిస్తున్నది.
ఆడపిల్లకు ఊపిరి..
ఆడపిల్ల అంటే కడుపులోనే చిదిమిసే రోజుల నుంచి తెలంగాణ సమాజం బయటపడింది. నాలుగేండ్ల కిందటివరకు ఆడపిల్లలు, భ్రూణహత్యల్లో రాష్ట్రం కూడా ఉన్నది. కానీ ఆ తరువాత భ్రూణహత్యలు, లింగనిర్ధారణ అంశాలపై ప్రభుత్వం తీసుకుంటున్న కఠిననిర్ణయాలు ఓ వైపు.. ఆడపిల్లలను అన్నింటా ఆదుకుంటామనే సంక్షేమ పథకాలు మరోవైపు.. అమ్మను బతికిస్తున్నాయి. తెలంగాణ లో స్త్రీ,పురుష నిష్పత్తి 2009లో 911 ఉండగా.. 2016-17లో ఈ నిష్పత్తి 959కి పెరిగింది. అంటే వెయ్యిమంది పురుషులకు 959 మంది మహిళలున్నారు. లింగనిర్ధార ణ, భ్రూణహత్యలకు పాల్పడుతున్న ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాకేంద్రాల్లో దాదాపు 31 ప్రైవేట్ దవాఖానలపై ప్రభుత్వం దాడులు నిర్వహించి, వాటిపై చర్యలు చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకేసారి ఏడు ప్రైవేట్ దవాఖాలను సీజ్‌చేసింది. అదేవిధంగా కేసీఆర్ కిట్‌తో రూ.13 వేల ఆర్థికసాయం, బాలికలకు ఉచిత విద్య, పెళ్లీడుకొచ్చాక కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఇప్పుడు ఆడపిల్లలకు వరంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ఆడపిల్లలకు ఊపిరిపోస్తున్నాయి.
స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమశాఖకు ఫస్ట్‌ర్యాంక్
రాష్ట్రంలో స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమశాఖ అద్భుత ప్రగతి సాధించింది. వివిధ శాఖల పనితీరును రాష్ట్రప్రభుత్వం వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించి 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ ర్యాంకులు ఇచ్చింది. సచివాలయంలోని మొత్తం 34 శాఖల్లో 20 శాఖలు సమర్పించిన వార్షిక నివేదికల ఆధారంగా.. మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధులశాఖ తొలిస్థానంలో నిలిచింది. ఈ శాఖ 9.84 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా.. 9.42 పాయింట్లతో కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలశాఖ, 8.44 పాయింట్లతో వ్యవసాయ, సహకారశాఖ, 8.12 పాయింట్లతో వైద్యారోగ్యశాఖ, 8.10 పాయింట్లతో పశుసంవర్ధక, పాడి, మత్స్యశాఖలు తొలి ఐదుస్థానాల్లో నిలిచాయి.
నీతిఆయోగ్ వెల్లడించిన లెక్కల ప్రకారం..
శిశు మరణాలు
2008 నుంచి 2014 వరకు తెలంగాణలో ఐదేండ్ల లోపు శిశు మరణాలు ప్రతివెయ్యిమందికి 80గా ఉన్నది. 2015 నుంచి ఈ సంఖ్య తగ్గుతూ వస్తున్నది. 2015లో ప్రతివెయ్యిలో 6.8 శాతంతో 60గా ఉండగా.. 2016లో 34గా మాత్రమే నమోదయింది. 2017 ఈ సంఖ్య 32కు తగ్గింది. ఈ విషయంలో దేశ సగటును పరిశీలిస్తే 2016లో 39, 2017లో 37గా ఉన్నది.
నవజాత శిశువుల మరణాలు
2008 నుంచి 2014 వరకు తెలంగాణలో నవజాత శిశు మరణాల సంఖ్య 58గా నమోదయింది. 2016లో ఈ సంఖ్య 21కి తగ్గగా.. 2017లో 20కి పడిపోయింది. దేశసగటు 2016లో 24గా, 2017లో 23గా నమోదయింది.
ఏడాదిలోపు చిన్నారుల మరణాలు
దేశవ్యాప్తంగా ఏడాదిలోపు చిన్నారుల మరణాలు 2016లో వెయ్యికి 34, 2017లో వెయ్యికి 33గా నమోదయ్యాయి. తెలంగాణలో ఈ మరణాలు 2016లో 31, 2017లో 29గా ఉన్నట్టు వెల్లడయింది.