జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళగిరి రైతులకు ఇచ్చిన మాట తప్పారని, అసలు మంగళగిరి నియోజకవర్గంలో ఎందుకు ఆయన పర్యటించారో అర్థం కావటంలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అవినీతి, అక్రమాలు, దుర్మార్గాల గురించి ఒక్కమాట కూడా పవన్ మాట్లాడటం లేదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. మంగళగిరి, తాడికొండ పర్యటనలో పవన్ వెంట టీడీపీ క్యాడర్ నడిచిందన్నారు. మంగళగిరి రూరల్ మండలం బేతపూడి గ్రామంలో గతంలో పర్యటించిన సమయంలో ఓ మహిళ పెట్టిన అన్నం తింటూ పవన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలన్నారు. ‘అమ్మా.. చంద్రబాబు మీ భూములను బలవంతంగా లాగేసుకుంటున్నారు. భూములను తీసుకోవడానికి చంద్రబాబు నోటిఫికేషన్ ఇస్తే రైతులకు అండగా నేను ఆమరణ దీక్ష చేస్తాను’ అని పవన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత ఐదారు నోటిఫికేషన్లు చంద్రబాబు ఇచ్చినా.. పవన్ అడ్రసేలేదన్నారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత రాజధాని ప్రాంతంలో పర్యటించారని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్ గెలుపు కోసం పవన్ తాపత్రాయపడ్డారన్నారు.
