వినాయకుడు అనగానే శుక్లాంబరథరం విష్ణుం..శశివర్ణం చతుర్భుజం అనే స్తోత్రం గుర్తుకు వస్తుంది.అలాగే వినాయకుడి అనగానే ఆయన బానపొట్ట, ఆ పొట్ట చుట్టూ సర్పం, వక్ర తొండం, నాలుగు చేతులు, ఆయన వాహనం మూషికం, చేటంత చెవులు గుర్తుకువస్తాయి. అసలు వినాయకుడి రూపం వెనుక ఉన్న తాత్వికత ఏంటీ…శుక్లాంబరథరం స్తోత్రం వెనుక ఉన్న మార్మికత ఏంటో తెలుసుకుందాం.
శుక్లాంబరధరం అంటే తెల్లని ఆకాశం. తెలుపు సత్త్వగుణానికి ప్రతీక. ‘శుక్లాంబరధరం విష్ణుంః అంటే సత్త్వగుణమైన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ఇక శశివర్ణం అంటే వినాయకుడు చంద్రునివలె కాలస్వరూపుడు.. అంటే ఆ సకల గణాధిపతి అయిన ఆ గణనాధుడే ముల్లోకాలకు రక్షించే లోక పాలకుడని అర్థం చేసుకోవాలి. అలాగే ‘చతుర్భుజం’ అంటే ధర్మార్ధ, కామ, మోక్షాలనే నాలుగు చేతులుగా చేసుకొని… శబ్దబ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నది ఆ విఘ్నేశ్వరుడే అని చెబుతోంది.
వినాయకుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది….పూర్ణకుంభంలాంటి ఆ దేహం, బాన కడుపు….. ఆయనలోని ఒక్కో అవయవం ఒక్కో జీవన సత్యాలను తెల్పుతుంది. ఆయన ప్రణవ స్వరూపుడే కాదు.. వక్తిత్వవికాసకర్త. వినాయక రూపం మనిషికి ఉండాల్సిన సద్గుణాలను చాటి చెబుతాయి..
మనం మొదట పూజించేది గణేశుడినే. స్మరించేది కూడా ఆ ఏకదంతుడినే …ఆయనలోని ఒక్కో అవయవం…ఒక్కో జీవన సత్యం…. పూర్ణకుంభంలాంటి ఆ దేహం…పరిపూర్ణమైన ఈ జగత్తుకు గుర్తు. ఇక లంబోదరుడి పెద్దబొజ్జ గణపతి భోజనప్రియత్వానికి చిహ్నం కాదు. జీవితంలో ఎదురయ్యే మంచిచెడులు వేటినయినా జీర్ణించుకోవాలని తెలియజేస్తుంది. గజాననుడి ఏనుగు తల, మేధస్సుకు సంకేతమైతే. సన్నని కళ్ళు నిశిత పరిశీలన అవసరమని చాటుతున్నాయి.
ఇక గణేషుడి వక్రతుండము ఏకంగా ఓంకార ప్రణవనాదానికి ప్రతీక. ఏనుగు లాంటి ఆయన ఆకారాన్ని మోస్తున్న మూషికం ఆశకు చిహ్నం. మూషికం చిన్నగానే వున్నా ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది. వేగంగా వెళ్తుంది. పట్టుదల వుంటే దేన్నయినా సాధించవచ్చని చాటుతుంది. అలాగే విఘ్నేశ్వరుడిపొట్టను చుట్టి ఉండే సర్పం శక్తికి సంకేతం.
గణేషుడి నాలుగు చేతులు మానవాతీత సామర్ధ్యాలకు, తత్వానికి సంకేతం. చేతిలో ఉన్న పాశ, అంకుశములు బుద్ధి, మనసులను సన్మార్గంలో నడిపించు సాధనాలకు ప్రతీకలు. మరో చేతిలో కనిపించే దంతం ఆయనదే. ఇక గజాననుడి ఏకదంతం మంచిని మాత్రమే వుంచుకుని వక్రమైనవాటిని వదిలేయాలని సూచిస్తుంది.
వినాయకుని చేటంత చెవులు అనవసరమైన వ్యర్థమైన విషయాలను చేటలా చెరిగేసి అవసరమైన మంచి సంగతులను మాత్రమే స్వీకరించాలని సూచిస్తాయి. అలాగే ఆయన చిన్న నోరు అతిగా మాట్లాడినందువల్ల అనర్థాలే తప్ప ఒరిగేదేం వుండదు. ఎక్కువ తెలుసుకుని తక్కువ మాట్లాడాలని చెబుతోంది
వినాయకుడు ధరించిన గొడ్డలి ఇహలోక బంధాలు శాశ్వతం కాదని, వాటిని తెంచేసుకోవాలని సూచిస్తుంది. ఇక గణేషుడికి ఎంతోె ప్రీతి పాత్రమైన లడ్డూలు ఆశయాలకు అనుకూలంగా కృషిచేస్తే ఫలితం దక్కుతుందని చాటుతాయి . మరొక చేతిలో మోదకం-ఉండ్రాయి ఉంటుంది. ఇక వినాయకుడి గుడికి వెళ‌్లే భక్తులు గుంజీలు తీయాలి.. భక్తులు తక్కిన దేవతల ఎదుట తప్పులు చేసివుంటే క్షమించమని చెంపలు వేసుకోవడం ఉందికానీ, వినాయకుని ఎదుట మాత్రంగుంజీలు తీయాలి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, నిగూఢ సంకేతలు కలిగిన అధినాయకుడే మన వినాయకుడు.