తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిశ్రమలు రావడం రాష్ర్టానికి ఎంతైనా అవసరముందనీ, తద్వారా యువతకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణ పెట్టుబడులకు కేంద్రంగా మారిందనీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు. యాజమాన్యాన్ని ఉద్ధేశించి మాట్లాడిన మంత్రి.. స్థానికులకు శిక్షణనిచ్చి ఉపాధి కల్పించాలన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, కేటీఆర్ చొరవ వల్లే రాష్ర్టానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విజన్‌తో ముందుకు వెళ్తున్నారనీ, ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనీ, సంగారెడ్డిలో ఈ పరిశ్రమ ఏర్పాటవడంతో తమ యువతకు ఉపాధి లభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీతో పాటు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయెష్ రంజన్, సంస్థ యాజమాన్యం, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.